logo

పేద బాలికలకు శక్తినిచ్చేలా..

కామారెడ్డి ప్రాంతంలో బాలికల అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.12 శాతం నమోదైంది. అనేక మంది పేద బాలికలు చదువుకు దూరంగా ఉంటున్నారు

Published : 29 Mar 2023 06:29 IST

 ఏటా వంద మంది చదువులకు చేయూత
ముందుకొచ్చిన పర్వతారోహకురాలు పూర్ణ, అంతరిక్ష పరిశోధకురాలు కావ్య
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి,  న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

* కామారెడ్డి ప్రాంతంలో బాలికల అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.12 శాతం నమోదైంది. అనేక మంది పేద బాలికలు చదువుకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను కూలీ పనులకు పంపుతున్నారు.
* ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన మలావత్‌ పూర్ణ, అమెరికాలోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో పని చేసే కావ్య కామారెడ్డి కేంద్రంగా ‘శక్తి’ పేరిట పేద అమ్మాయిలను ఆదుకోవడానికి శ్రీకారం చుట్టారు. విరాళాల ద్వారా విద్యానిధిని పోగు చేసి చదువుతో పాటు విభిన్న అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

విరాళాల సేకరణ..

పూర్ణ పర్వతాలు అధిరోహించడానికి నిధులు సమీకరిస్తున్నారు. అందులోంచి కొంత మొత్తాన్ని శక్తి ప్రాజెక్టుకు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు. కావ్య విదేశాల్లో పలు సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. వీటితో ఏటా వంద మంది బాలికలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.

వీరి పరిచయం..

* మలావత్‌ పూర్ణ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా మానాల. పిన్న వయసులోనే ఎవరెస్ట్‌ అధిరోహించారు. ఇప్పటి వరకు ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలు అధిరోహించారు.
* కామారెడ్డి పట్టణానికి చెందిన కావ్య అమెరికాలో ఏరోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ, జార్జియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం అస్ట్రోనాట్‌ శిక్షకురాలిగా ఉన్నారు. స్పేస్‌ క్రాఫ్ట్‌, స్పేస్‌ సూట్‌ విభాగంలో దశాబ్దానికిపైగా అనుభవం ఉంది.


త్వరలోనే కార్యరూపం - పూర్ణ, కావ్య

అక్షరముంటేనే ఆర్థికంగా స్థిరపడగలం. ఆకాశమంత ఎత్తుకు పేద బాలికలు ఎదగాలనే సంకల్పంతో శక్తి ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఎంచుకున్న రంగాల్లో ఉన్నతంగా రాణించేలా తోడ్పాటునందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే మా కార్యక్రమం కార్యరూపం దాల్చనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని