logo

వసూళ్లు శత శాతం.. గ్రంథాలయాలకు ఎగనామం

ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వివిధ ప్రకటనలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల బలోపేతానికి నిధులు అవసరం. ఏళ్లుగా సెస్సు రూపేణ రావాల్సిన నిధులు జమ కావడం లేదు

Published : 29 Mar 2023 06:31 IST

 పంచాయతీ, పురపాలికలకు మెరుగ్గా రాబడి 

 సెస్సు చెల్లింపుల్లో నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

జిల్లా గ్రంథాలయంలో చదువుకుంటున్న ఉద్యోగార్థులు

ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వివిధ ప్రకటనలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల బలోపేతానికి నిధులు అవసరం. ఏళ్లుగా సెస్సు రూపేణ రావాల్సిన నిధులు జమ కావడం లేదు. ఫలితంగా కేంద్రాల అభివృద్ధి కుంటుపడింది. ఆస్తి పన్నుతోపాటు గ్రంథాలయ సెస్సును ప్రజల నుంచి వసూలు చేస్తున్న పంచాయతీలు, పురపాలికలు గ్రంథాలయాల ఖాతాలో జమ చేయకపోవడంతో ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 90 శాతానికి పైగా పన్నులు వసూలయ్యాయి. మార్చి 31 గడువు ముగియగానే సెస్సు చెల్లిస్తే విజ్ఞాన బాంఢాగారాలకు ప్రయోజనం చేకూరుతుంది.

నాలుగేళ్లుగా నయా పైసా ఇవ్వలేదు

జిల్లాలో మూడు పురపాలకలు,  526 పంచాయతీలు ఉన్నాయి. 22 మండలాల్లో 17 గ్రంథాలయ శాఖలున్నాయి. వీటికి రావాల్సిన లక్షలాది రూపాయలు బకాయిపడ్డాయి. నాలుగేళ్లుగా నయా పైసా సెస్సు చెల్లించిన దాఖలాలు లేవు. చిన్నపాటి మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు వీలు లేకుండా పోతోంది. అధికారులు పలుమార్లు పంచాయతీలకు లేఖ రాసినా స్పందించడం లేదు. గతేడాది తాఖీదులు జారీ చేయడంతో పలు కేంద్రాల నుంచి స్పందన వచ్చింది. గతంలో సెస్సుకు సంబంధించిన దస్త్రాలు పురపాలికల్లో గల్లంతయ్యాయి. పలువురు ఆస్తి పన్నుకు సంబంధించి చెక్కులు ఇస్తుండటంతో బల్దియా ఖాతాలో జమ చేస్తున్నారు. వీటిని గ్రంథాలయానికి బదలాయింపు చేయడం లేదు.

ఆశల ఊసులు

మూడేళ్ల క్రితం సర్పంచులకు జిల్లా గ్రంథాలయంలోనే శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీల్లో జమవుతున్న సెస్సును వెంటనే చెల్లించాలని సూచించినావారి నుంచి స్పందన కరవైంది. ప్రస్తుతం ఉద్యోగాల ప్రకటనల నేపథ్యంలో అభ్యర్థులు గ్రంథాలయాలకు వస్తున్నారు. వసతుల లేమి కారణంగా వారికి అగచాట్లు తప్పడం లేదు. బకాయిలు సమకూరితే బల్లలు, కుర్చీలు, పుస్తకాలు తెప్పించే వీలుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే అవకాశాలు ఉన్నాయి.


ఇప్పటికే నోటీసులు అందజేశాం
- పున్న రాజేశ్వర్‌, గ్రంథాలయ జిల్లా ఛైర్మన్‌

పంచాయతీలు సెస్సు బకాయిలను వెంటనే చెల్లించాలని ఇటీవల పురపాలికలు, పంచాయతీలకు నోటీసులు అందజేశాం. ఇవి సమకూరితే అభివృద్ధి చేసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దాతల సహాయంతో వసతులు సమకూరుస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని