logo

నిరీక్షిస్తూ..నీరసిస్తూ..

ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రజలకు భయం. ఇంటి నుంచి త్వరగా బయలుదేరినా రైల్వేగేటు రూపంలో ఆటంకం ఎదురవుతోంది.

Updated : 29 Mar 2023 06:44 IST

రైల్వేగేటుతో ప్రజల ఇబ్బందులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఇరువైపులా నిలిచిన వాహనదారులు

ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రజలకు భయం. ఇంటి నుంచి త్వరగా బయలుదేరినా రైల్వేగేటు రూపంలో ఆటంకం ఎదురవుతోంది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక వాహనాదారులు అరగంటపాటు వేచిచూడాల్సి వస్తోంది. నిత్యం ప్రతి వాహనదారుడు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ప్రధాన కారణం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ రైల్వేగేటు. వేసవి ఎండలు మండుతుండడంతో మధ్యాహ్నం వేళ నిరీక్షించలేక నీరసించిపోతున్నారు.

పెరిగిన  రాకపోకలు

మీటరు గేజ్‌ ఉన్నకాలంలో రైళ్లు తక్కువగా నడిచేవి. బ్రాడ్‌గేజ్‌గా మారిన తర్వాత రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైళ్లు నిత్యం 56 తిరుగుతున్నాయి. గూడ్స్‌ రైళ్లు 20 నుంచి 25 వరకు నడుస్తున్నాయి. గంటలో నాలుగు నుంచి ఐదు వస్తుండడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. గేటు ఎత్తగానే పరుగులు పెడుతుండడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

క్రాసింగ్‌లతో  తీవ్ర జాప్యం

రెండు మార్గాల్లో ఒకేసారి రైళ్లు వస్తే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు అరగంట పాటు గేటు వేస్తున్నారు. నిజామాబాద్‌ వైపు నుంచి రైలు వచ్చే ముందు గేటు వేస్తారు. అది కామారెడ్డి స్టేషన్‌కు చేరుకున్న తర్వాత సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైలుకు లైన్‌ క్లియర్‌ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి.

కలెక్టరేట్‌కు వెళ్లేందుకు  అవస్థలు

నూతన కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయాలను అడ్లూర్‌ శివారులో నిర్మించారు. దూర ప్రాంతాల నుంచి ఉన్నతాధికారులకు తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చే ప్రజలు ఈ మార్గం గుండానే వెళ్లాలి.  

ఎన్నికల హామీగానే..

అశోక్‌నగర్‌ రైల్వేగేటు పడిన సమీపంలో భూగర్భ వంతెన ద్వారా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు దృష్టి సారించడం లేదు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నేతలు వంతెన నిర్మిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు.

కానరాని  ప్రత్యామ్నాయాలు

భూగర్భ వంతెన లేదా ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వేగేటుకు సమీపంలో కొత్త పట్టణంలోని జయశంకర్‌కాలనీ, భవానినగర్‌, కేపీఆర్‌, సైలానీబాబా కాలనీవాసులు రైల్వేగేటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను భరించలేక ఈ కాలనీల్లో అద్దెకు ఉండేందుకు ప్రజలు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని