logo

సారు ఏమీ తీరు..?

జిల్లా సరిహద్దు మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 26 May 2023 06:13 IST

సరిహద్దు తహసీల్‌లో అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, మద్నూర్‌: జిల్లా సరిహద్దు మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ముఖ్యవ్యక్తి స్థాయి మరిచి స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో కలసి విందులలో పాల్గొన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన కీలక వ్యక్తే విందులో పాల్గొనడంపై సామాజిక, ప్రజాసంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంపై శాఖపరంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్లలో ప్రైవేటు వ్యక్తిదే హవా..

భూముల క్రయవిక్రయాలకు మీసేవలో స్లాట్‌ బుక్‌చేసుకుని నిర్దేశిత సమయంలో తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుంటే రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలి. ఇందుకు విరుద్ధంగా ఈ కార్యాలయంలో స్లాట్‌ బుక్‌చేయడం మొదలు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అంతా ఓ ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఈ వ్యక్తికి తహసీల్దార్‌ కార్యాలయంలోని ‘కీలక వ్యక్తి’కి మధ్య ఉన్న ‘‘మామూలు’’ సంబంధమే కారణంగా తెలుస్తోంది.

పొరుగు రాష్ట్రంలో నివాసం..

ఈ మండలంలో మట్టి, ఇసుక మాఫియాతో సార్‌ సంబంధం వెలకట్టలేనిదనే ఆరోపణలున్నాయి. పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం మాఫియాతో కీలక వ్యక్తి సంబంధాలపై రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పొరుగు రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడికే పలువురుని పిలిపించుకుని మంతనాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ అయింది.

చర్యలు తీసుకుంటాం

తహసీల్‌ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ప్రజాప్రతినిధులతో పాటు ఇసుక మాఫియాతో కలసి విందు సమావేశాల్లో పాల్గొన్న తీరుపై చిత్రాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నాం. ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకుంటాం.

రాజాగౌడ్‌, ఆర్డీవో, బాన్సువాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని