logo

ముందస్తు సాగుకు కసరత్తు

అకాల వర్షాలు, వడగళ్ల వానల బారి నుంచి అన్నదాతలను కాపాడేందుకు సీజన్ల వారీగా పంట కాలాన్ని 3-4 వారాల ముందుకు జరపడమే పరిష్కారమని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Published : 26 May 2023 05:02 IST

27న నెమ్లిలో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సదస్సు
కర్షకులకు దిశానిర్దేశం చేయనున్న శాస్త్రవేత్తలు, యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: అకాల వర్షాలు, వడగళ్ల వానల బారి నుంచి అన్నదాతలను కాపాడేందుకు సీజన్ల వారీగా పంట కాలాన్ని 3-4 వారాల ముందుకు జరపడమే పరిష్కారమని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముందస్తు సాగు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. నిజాంసాగర్‌ ఆయకట్టు అధికంగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ముందస్తు సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన కార్యాచరణను వ్యవసాయశాఖ రూపొందిస్తున్న తీరుపై ‘ఈనాడు’ కథనం.

సాధ్యాసాధ్యాలపై చర్చ

బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే మిగతా ప్రాంతాలకంటే పది - పదిహేను రోజుల ముందుగానే సాగు చేస్తున్నారు. ఎక్కువగా దీర్ఘకాలిక వరి వంగడాలను మాత్రమే ముందస్తుగా సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ నిర్ధారణకు వచ్చింది. స్వల్పకాలిక వరి వంగడాలను సైతం ముందస్తుగానే సాగు చేసే విధంగా ఏర్పాట్లు చేపడితేనే అన్నదాతలకు ప్రయోజనం ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. ముందస్తు సాగు సఫలం కావాలంటే వ్యవసాయశాఖతో పాటు సాగునీటి పారుదల శాఖ, మార్కెటింగ్‌ శాఖను సమన్వయం చేయాల్సి ఉంది. అన్నదాతలను సైతం ముందస్తు సాగు వైపు మళ్లించాల్సి ఉంటుంది.\

సభాపతి చొరవతో..

ముందస్తు సాగుపై అన్నదాతలను సమాయత్తం చేసే నిమిత్తం ఈ నెల 27న నస్రుల్లాబాద్‌ మండలంలోని నెమ్లిలో ఉభయ జిల్లాలు(బాన్సువాడ నియోజవకర్గం పరిధిలోని) రైతులను సమావేశపరిచి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దీనిని ఏర్పాటు చేయిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే మొదటగా నియోజకవర్గంలోని రైతులచే ముందస్తు సాగును చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. సదస్సులో రుద్రూర్‌ వరి పరిశోధన కేంద్రానికి చెందిన వ్యవసాయ, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలతో రైతులకు ముందస్తు సాగుతో కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. అనంతరం కలెక్టర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ, నీటిపారుదల, మార్కెటింగ్‌, లీడ్‌ బ్యాంక్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అవగాహన కల్పించేందుకే

బాన్సువాడ నియోజకవర్గంలో ముందస్తు సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 27న నెమ్లిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. స్వల్పకాలంలో పెట్టుబడి తక్కువ, దిగుబడులు ఎక్కువగా వచ్చే వరి వంగడాలపై శాస్త్రవేత్తల సమక్షంలో రైతులకు వివరించనున్నాం. ఇదే తీరున జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

వీరాస్వామి, వ్యవసాయాధికారి, కామారెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు