logo

కోనేరులో ఈత కొట్టిన ఆలయ ఈవో.. షోకాజ్‌ నోటీసు జారీ

నీలకంఠేశ్వర ఆలయ పుష్కరిణి (కోనేరు)లో ఒక వైపు స్వామివారికి అభిషేకాలు చేస్తుండగా.. ఆ పక్కనే ఆలయ ఈవో వేణు ఈతకొడుతున్న దృశ్యాలు వైరల్‌ కావడంపై దేవాదాయశాఖ తీవ్రంగా పరిగణించింది.

Published : 26 May 2023 14:51 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: నీలకంఠేశ్వర ఆలయ పుష్కరిణి (కోనేరు)లో ఒక వైపు స్వామివారికి అభిషేకాలు చేస్తుండగా.. ఆ పక్కనే ఆలయ ఈవో వేణు ఈతకొడుతున్న దృశ్యాలు వైరల్‌ కావడంపై దేవాదాయశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రథసప్తమి సందర్భంగా పుష్కరిణిలో స్వామివారి విగ్రహాలకు అర్చకులు శ్రీచక్రస్నానం చేయించారు. అదే సమయంలో కోనేరులో ఈవో ఈత కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నాలుగురోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

దీనిపై స్పందించిన దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ సుప్రియ.. ఈవోకు శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దేవుడికి అభిషేకం జరుగుతుండగా ఈత కొట్టడంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఈవోను ఆదేశించారు. ఈవో భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నూతన రథం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని భక్తులు ఉన్నతాధికారులను కోరారు. ఈ అంశంపై పూర్తస్థాయి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సుప్రియ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని