logo

ముంగిట్లోకి.. నవ పాలన

చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయి... స్వరాష్ట్ర సాధనకు ఉపయోగపడిన నినాదమిది. తెలంగాణ సిద్ధించాక ప్రజల సంక్షేమం కోసం సర్కారు తపించింది. పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సర్కారు తొమ్మిదేళ్లలో విప్లవాత్మక, చెప్పుకోదగ్గ మార్పులకు నాంది పలికింది.

Updated : 02 Jun 2023 06:12 IST

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు అభివృద్ధి ఫలాలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయి... స్వరాష్ట్ర సాధనకు ఉపయోగపడిన నినాదమిది. తెలంగాణ సిద్ధించాక ప్రజల సంక్షేమం కోసం సర్కారు తపించింది. పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సర్కారు తొమ్మిదేళ్లలో విప్లవాత్మక, చెప్పుకోదగ్గ మార్పులకు నాంది పలికింది. ముంగిట్లోకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా, మండల, పంచాయతీల వికేంద్రీకరణ ఒక ఎత్తైతే, పాలనలోనూ పారదర్శకతకు సాంకేతికతను జోడించారు. పదో వసంతంలోకి అడుగిడుతున్న తరుణంలో మార్పులను మననం చేసుకుందాం.


కొత్త పంచాయతీలు

రాష్ట్ర ఆవిర్భావం నాటికి పంచాయతీలకు అనుబంధ గ్రామాలుండేవి. ఈ పల్లెలు ఏకంగా పంచాయతీలకు కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రజలు పాలనాపరమైన అవసరాల కోసం ఎంతో దూరం ప్రయాణించాల్సి వచ్చేది. స్వరాష్ట్రం సిద్ధించాక అనుబంధ, గిరిజన పల్లెల కల సాకారమైంది. పంచాయతీ హోదా లభించడంతో గ్రామాభివృద్ధికి అడుగులు పడ్డాయి. స్వరాష్ట్రంలో ఉభయ జిల్లాల్లో 364 నూతన పంచాయతీలు ఏర్పాటయ్యాయి.


పుర హోదా...

అన్ని అర్హతలున్నా మేజర్‌ పంచాయతీలకు పుర హోదా కల్పించడంలో గత పాలకులు తాత్సారం చేశారనే వాదన ఉంది. రాష్ట్రం ఆవిర్భవించాక ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, భీమ్‌గల్‌లకు బల్దియా హోదా లభించింది. రూ.25 కోట్ల చొప్పున టీయూఎఫ్‌ఐడీసీ నిధులు కేటాయించారు. ఉద్యానవనాలు, సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనతో కొత్తగా ఆవిర్భవించిన మున్సిపాలిటీల్లో వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది.


సాంకేతిక శోభ

ఒకప్పుడు మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి అడిగినంత ముడుపులు సమర్పించుకునే దుస్థితి ఉండేది. రాష్ట్రం సిద్ధించాక పారదర్శకత కోసం స్వయంగా దరఖాస్తు చేసుకుని, నిర్ణీత గడువులోగా అధికారులు పరిష్కరించకపోతే అనుమతి లభించేలా నిబంధన తీసుకొచ్చారు. స్వయంగా దరఖాస్తు చేసుకోవడం, ఆస్తిపన్ను స్వీయ మదింపు వంటి సదుపాయాలతో టీఎస్‌బీపాస్‌ను తెచ్చారు. గ్రామాల్లోనూ సులభతర పాలనకు ఈ-పంచాయతీ ఉంది. ఆన్‌లైన్‌లో చెల్లించే వ్యవస్థతో మధ్య దళారులకు అడ్డుకట్ట వేయడానికి దోహదం చేశారు.


రవాణా సేవలు

రవాణా శాఖలో సులభతరమైన సేవలు అందుకోవడానికి స్మార్ట్‌ (సింపుల్‌, మోరల్‌, అకౌంటబుల్‌, రెస్పాన్సివ్‌ అండ్‌ ట్రాన్స్‌పరెంట్‌-ఎస్‌.ఎం.ఏ.ఆర్‌.టి)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటిజన్‌ చార్టర్‌తో నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో బాన్సువాడ డివిజన్‌ ప్రజలు లైసెన్సులు పొందడానికి బోధన్‌ రావాల్సి వచ్చేది. తాజాగా బాన్సువాడలోనే సేవలు అందిస్తున్నారు. వాహన ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్సు వంటివి ‘ఎంవ్యాలెట్‌’లో స్మార్ట్‌ఫోన్‌లో భద్రపరచుకునే అవకాశం కల్పించారు.


ఐటీ కంపెనీలు

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరించే కార్యక్రమాన్ని సర్కారు తీసుకుంది. గ్రామీణ యువతకు ఐటీ ఉద్యోగాలను చేరువ చేయడం, హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించే ఆశయంతో తీసుకొచ్చిన విధానంలో నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ నిర్మించారు. రూ.50 కోట్లతో నిర్మించిన ఇందులో కనీసంగా వెయ్యి మందికిపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆస్కారముంటుందని ప్రకటించారు.


పోలీస్‌శాఖలో సంస్కరణలు

స్నేహపూర్వక పోలీసింగ్‌ ప్రస్తుతం ఓ విధానమైంది. పారదర్శక, సత్వర సేవలే లక్ష్యంగా సాంకేతికతను వినియోగించి మార్పులు చేపట్టారు. పోలీస్‌ కార్యాలయాలు, ఠాణాల్లో ఈ-ఆఫీస్‌(కాగిత రహిత) సేవలు అమలు చేస్తున్నారు. కేసు పూర్వాపరాలను ఆన్‌లైన్‌ చేసే సీసీటీఎన్‌ఎస్‌ (క్రైమ్‌ కంట్రోల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం)ను ప్రారంభించారు. 5ఎస్‌(ఐదు రకాల సేవలు ఏకకాలంలో అందుబాటులోకి తేవడం) విధానం అమల్లోకి వచ్చాక ఠాణాలో ఏ అధికారి అందుబాటులో ఉన్నాఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.


భూ దస్త్రాల ప్రక్షాళన

భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం 2016 సెప్టెంబరులో భూదస్త్రాల నవీకరణకు శ్రీకారం చుట్టింది. నిజాం కాలం నాటి దస్త్రాలను నవీకరించి రైతులకు డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించింది. భూముల క్రయవిక్రయాలు పారదర్శకంగా చేపట్టేందుకు రిజిస్ట్రేషన్‌తో పాటే మ్యుటేషన్‌ ఏకకాలంలో అయ్యేలా ధరణి పోర్టల్‌ దోహదపడుతోంది. ప్రస్తుతం కేవలం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేపడుతున్నారు.


శాఖల పునర్విభజన

సాగు నీటిపారుదల శాఖతో పాటు ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖలను పునర్విభజన చేయడంతో పనితీరు మెరుగుపడింది. ప్రస్తుతం నీటిపంపిణీతో పాటు పనుల పర్యవేక్షణను ఒకే విభాగం కిందకు తీసుకువచ్చి ఉభయ జిల్లాలకు సీఈలను నియమించారు. ఆర్‌అండ్‌బీతో పాటు పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖల్లో సమూల మార్పులు తీసుకువచ్చారు. ర.భ. శాఖను పునర్‌ వ్యవస్థీకరించారు. దీంతో నిజామాబాద్‌ జిల్లాకు నూతనంగా ఆర్‌అండ్‌బీ ఎలక్ట్రికల్‌ డివిజన్‌, ఎన్‌హెచ్‌ సర్కిల్‌, బిల్డింగ్‌ సబ్‌డివిజన్లు ఏర్పాటయ్యాయి.


కొత్త మండలాలు

స్వరాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటు వేగంగా సాగుతోంది. కామారెడ్డి జిల్లా ఆవిర్భావ సమయంలో కొత్తగా బీబీపేట, రామారెడ్డి, పెద్దకొడపగల్‌, రాజంపేట, నస్రుల్లాబాద్‌ మండలాలు ఏర్పడ్డాయి. అనంతరం స్థానిక ప్రజల కోరిక మేరకు మద్నూర్‌ మండలం నుంచి డోంగ్లీని కొత్తమండలంగా చేశారు. తాజాగా మాచారెడ్డి మండలంలోని తొమ్మిది రెవెన్యూ గ్రామాలతో పల్వంచ మండలాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల విభజన సమయంలో నిజామాబాద్‌ జిల్లా పరిధిలో చందూర్‌, మోస్రా, రుద్రూర్‌ మండలాలను ఏర్పాటు చేశారు. తాజాగా డొంకేశ్వర్‌, సాలూరా, ఆలూరు, పొతంగల్‌ కొత్తగా ఏర్పాటయ్యాయి.


దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దశాబ్ది ఉత్సవాలకు కలెక్టరేట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదికతో పాటు ప్రజలు, అధికారులు కూర్చోవడానికి వీలుగా టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు