logo

రౌడీ షీటర్‌ ఆరీఫ్‌ దారుణ హత్య

కత్తుల దాడిలో నిజామాబాద్‌కు చెందిన రౌడీషీటర్‌ ఆరీఫ్‌(28) మృతి చెందాడు.

Published : 02 Jun 2023 05:56 IST

ప్రతీకారంతోనే నిందితుల పథక రచన
కారులో వెంబడించి కత్తులతో దాడి

చికిత్స పొందుతున్న ఖదీర్‌, మృతుడు ఆరీఫ్‌

ఈనాడు, నిజామాబాద్‌, ఎడపల్లి, న్యూస్‌టుడే: కత్తుల దాడిలో నిజామాబాద్‌కు చెందిన రౌడీషీటర్‌ ఆరీఫ్‌(28) మృతి చెందాడు. ఎడపల్లి శివారులో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. ప్రతీకారంతో శత్రువులు పథకం ప్రకారం వెంబడించి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిజామాబాద్‌ నగరం ముజాహిద్‌ కాలనీకి చెందిన ఆరీఫ్‌పై ఆరో ఠాణాలో రౌడీషీట్‌ తెరిచారు. గతేడాది డిసెంబరు 31న జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. ఆరీఫ్‌ 2019లో తనపై నమోదైన కేసు వాయిదాకు హాజరయ్యేందుకు పెయింటర్స్‌ కాలనీకి చెందిన మిత్రుడు ఖదీర్‌తో కలిసి బోధన్‌ కోర్టుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో వీరు ఎడపల్లి శివారులోని వంతెనపైకి చేరుకున్నాక ఎదురుగా వస్తున్న లారీకి చివరి భాగంలో తగిలి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. పథకం ప్రకారం శత్రువులు వీరిని కారులో వెంబడించిన విషయాన్ని గమనించి కంగారులో ప్రమాదానికి గురై పడిపోయారా అనేది తెలియాల్సి ఉంది. కిందపడిపోయిన ఇద్దరిని వెనకాలే కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు పట్టుకున్నారు. ఆరీఫ్‌ను పక్కకు తీసుకెళ్లి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి పరారయ్యారు. ఖదీర్‌ కిందపడిపోగా కాలుకు గాయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి పోలీసులు క్షతగాత్రులను బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరీఫ్‌ పరిస్థితి విషమించటంతో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ ఖదీర్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని.. ఆయన వాగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కిరణ్‌కుమార్‌, బోధన్‌ రూరల్‌ సీఐ శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతీకరం తీర్చుకునేందుకే పథకం ప్రకారం ప్రత్యర్థులు హత్యకు కుట్ర పన్నినట్లు చెప్పారు. తెల్లరంగు కారులో నిందితులు ప్రయాణించారని, సమద్‌, ఇర్ఫాన్‌ సహా మరో నలుగురు ఇందులో పాల్గొన్నట్లు వివరించారు. వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని