logo

వివాదానికి పరిష్కారం దొరికేనా!

తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం శనివారం జరగనుంది. హైదరాబాద్‌లోని రూసా భవనంలో ఉదయం 11 గంటలకు సభ్యులు భేటీ కానున్నారు.

Updated : 03 Jun 2023 06:00 IST

నేడు తెవివి పాలకమండలి భేటీ

ఈనాడు, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం శనివారం జరగనుంది. హైదరాబాద్‌లోని రూసా భవనంలో ఉదయం 11 గంటలకు సభ్యులు భేటీ కానున్నారు. ముందస్తుగా నిర్ణయించిన సమావేశమైనప్పటికీ.. వర్సిటీలో నెలకొన్న వివాదాలకు పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుందా..? అనే చర్చ సాగుతోంది. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్‌ ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఉపకులపతి నియమించిన రిజిస్ట్రార్‌ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మే నెల వేతనాల బిల్లులపై ఆయన సంతకాలు చేశారు. ప్రస్తుతం అవి బ్యాంకుకు చేరాయి. అయితే రిజిస్ట్రార్‌ విషయంలో గత నెల ఇదే సమయానికి రిజిస్ట్రార్‌ ఎవరనే విషయంలో సందిగ్ధతతో బ్యాంకు వారు బిల్లులను అనుమతించని విషయం తెలిసిందే. మళ్లీ అదే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు వారు వాటిని అనుమతిస్తారా..తిరస్కరిస్తారనేది సోమవారం లోపు తేలిపోనుంది.

 భిన్నవాదలతో ఎన్నాళ్లు..: పాలకమండలిలో విద్యశాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్లు ప్రభుత్వం తరఫున ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉంటారు. ఉపకులపతికి, పాలకమండలికి మధ్య అభిప్రాయభేదాల నేపథ్యంలో సమావేశాలు జరుగుతున్న తీరు వివాదాస్పదం అవుతోంది. ఉపకులపతి హాజరుకావటం లేదు. ఎక్స్‌అఫీసియో హోదాలో పాల్గొంటున్న ఐఏఎస్‌లలో ఒకరు ఛైర్మన్‌గా సమావేశాలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల చట్టానికి లోబడి ఈ విధంగా ముందుకెళ్తున్నామని వివరిస్తున్నారు. కాగా.. పాలకమండలికి ఛైర్మన్‌ హోదా ఉపకులపతిగా తనదే అని.. తాను లేకుండా సమావేశాలు నిర్వహించటం, తీర్మానాలు చేయటం చెల్లుబాటు కావనేది ఉపకులపతి వాదన. ఈ విషయంలో ఆయన కోర్టుకు వెళ్లి మరీ మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సభ్యులు తాను లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ఓ లేఖనూ విడుదల చేశారు.
 కొనసాగుతున్న గందరగోళం: ఉప కులపతి, పాలక మండలికి మధ్య విభేదాలు న్యాయస్థానం వరకు చేరటంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇరువురు ఏకతాటిపైకి వచ్చి చర్చించే పరిస్థితులు కనిపించటం లేదు. ఉపకులపతి తనకు అధికారాలున్నాయని చెబుతూ రిజిస్ట్రార్‌ను నియమిస్తూ పోతున్నారు. పాలకమండలి ఇదే తరహాలో మరొకరిని నియమిస్తోంది. ఇలా ఎవరి దారి వారిదే అవుతున్న తరుణంలో వర్సిటీ పాలనలో గందరగోళం నెలకొంటోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన నిధుల వ్యయాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనేది పాలకమండలి వాదన. అలాంటిదేమీ లేదని ఉపకులపతి చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజం అని తేల్చితే కాని వివాదం ఒక కొలిక్కి రాదు. అది చేయాలంటే.. ప్రభుత్వం కల్పించుకోవాలి. అదే జరిగితే కొత్త సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందనే చర్చ మొదలైంది. కోర్టులో మధ్యంతర ఉత్తర్వులపై పాలకమండలి వేసిన పిటీషన్‌ విచారణకు వచ్చాక గానీ చేసిన తీర్మానాల అమలుకు అడుగులు పడే పరిస్థితి కనిపించటం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని