సంక్షేమం విరిసింది.. రైతుకు బంధువైంది
‘స్వరాష్ట్రం సిద్ధించే నాటికి తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. తీవ్రమైన విద్యుత్తు కోతలతో పారిశ్రామిక రంగం కుదేలైంది
దశాబ్ది ఉత్సవాల్లో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
‘స్వరాష్ట్రం సిద్ధించే నాటికి తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. తీవ్రమైన విద్యుత్తు కోతలతో పారిశ్రామిక రంగం కుదేలైంది. సాగునీటి రంగంలో జరిగిన అన్యాయంతో తెలంగాణ పంటపొలాలు పడావు పడ్డాయి. గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించి అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమప్రాధాన్యతనిస్తూ భారాస ప్రభుత్వం ముందుకెళ్తోంది. లక్ష్య సాధన దిశగా రాష్ట్రం పురోగమిస్తోంది. గత తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సఫల రాష్ట్రంగా, ప్రగతి పథంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబడింది. తొమ్మిదేళ్ల కాలంలో మనం సాధించిన విజయాలు అసామాన్యమైనవి.’
సభాపతి
ఈనాడు డిజిటల్, కామారెడ్డి,న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్: అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల మీద పరిపాలన సాగుతోందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ వ్యవసాయానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. ఇంకా ఏమన్నారంటే..
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎరువులు, విత్తనాల కొనుగోలుకే రైతుబంధు
ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చేయడం లేదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని.. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది ఎరువులు, విత్తనాల కోసమేనని అన్నారు. రైతు బంధు, బీమా పథకాలను అమలు చేస్తోంది మన రాష్ట్రమేనన్నారు. పక్కరాష్ట్రాల రైతులు బాన్సువాడకు వచ్చి రూ.1200లకు క్వింటాలు ధాన్యం విక్రయించుకుని వెళ్తున్న విషయాన్ని అన్నదాతలు గమనించాలన్నారు.
ముందస్తుతోనే సాగు బాగు
వడగళ్లు, అకాల వర్షాల బారి నుంచి అన్నదాతలు బయటపడాలంటే ముందస్తు సాగుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వానాకాలం సీజన్‌లో ప్రస్తుత మాసం చివరి వరకు నాట్లు పూర్తిచేసుకుంటే అక్టోబరు 15 నాటికి వరికోతలు పూర్తవుతాయన్నారు. యాసంగిలో నవంబరు చివరి నాటికి నాట్లు పూర్తిచేస్తే మార్చి 15 నాటికి కోతలు పూర్తవుతాయని తెలిపారు.
అనుబంధ రంగాలకు ప్రోత్సాహం..
గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోస్తోందని సభాపతి పేర్కొన్నారు. జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లల విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు 75 శాతం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నెల 8న రెండోవిడత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
సంక్షేమంలో అగ్రగామి..
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఆసరా పథకం కింద పింఛన్లు, బీడీకార్మికులకు జీవనభృతి, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నారన్నారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ దఫేదార్ శోభ, కామారెడ్డి పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ జాహ్నవి, వైస్‌ఛైర్‌పర్సన్ ఇందుప్రియ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, పాలనాధికారి జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు పాలనాధికారులు వెంకటేశ్‌ధోత్రే, కె.చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అటవీశాఖ అధికారిణి నిఖిత, జిల్లా అధికారులు, సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అమరవీరులకు నివాళి
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తొలుత నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఆచార్య జయశంకర్, చాకలి ఐలమ్మ, కానిస్టేబుల్ కిష్టయ్య, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. స్టాళ్లు
ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజంపేట మండలం శివాయిపల్లి, ఆరెపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నృత్యాలు ఆలోచింపజేశాయి. ఉత్సవాల ప్రాంగణంలోనే వ్యవసాయ, సంక్షేమ, ఉద్యావన తదితర శాఖలకు చెందిన అధికారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉత్సవాలను నిర్వహించడంతో అధికారులు, సిబ్బంది మినహా ప్రజలు పెద్దగా హాజరు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.