logo

సేవలకు ఆయుష్‌ తీరిందా..?

దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేద, హోమియో, యునానీలో మెరుగైన ఔషధాలు ఉన్నాయని ఆయుష్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు

Published : 03 Jun 2023 05:42 IST

నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది

బాన్సువాడ యునానీ ఆసుపత్రి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేద, హోమియో, యునానీలో మెరుగైన ఔషధాలు ఉన్నాయని ఆయుష్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ వైద్యశాలలపై పర్యవేక్షణ కొరవడి రోగులకు సేవలు అందడం లేదు. జిల్లాలో నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)తో పాటు ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో ఆయుర్వేద, యునానీ, హోమియో వైద్యశాలలు ఉండగా వీటిలో సిబ్బంది కొరత ఉంది. ఈ ఆసుపత్రుల్లో వైద్యులు నెలకు రెండు నుంచి మూడు రోజులు మాత్రమే విధులకు హజరవుతూ నామమాత్రంగా నిర్వహిస్తున్న తీరుపై ఈనాడు కథనం.

వైద్యం అటకెక్కుతోంది

ఆయుష్‌ వైద్యశాలల్లో నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలందించి ఔషధాలు ఇవ్వాలి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రోగులకు వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. కాని వైద్యులు నామామాత్రంగా సేవలందిస్తున్నారు. వైద్యులున్న వైద్యశాలల్లో ఫార్మాసిస్టును నియమించడం లేదు. ఫార్మాసిస్టు ఉన్న వైద్యశాలల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు వైద్యశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేశారు.

ఇవీ ఘటనలు..

* బాన్సువాడ ఆయుష్‌ వైద్యశాలలో ఓ వైద్యుడు కేవలం వారానికి ఒక్క రోజుమాత్రమే విధులకు హాజరవుతున్నట్లు ఆ శాఖ అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయింది. నాలుగేళ్లుగా ఇదే తీరున విధులు నిర్వహిస్తున్నట్లు వైద్యశాల సిబ్బంది అనధికారికంగా చెబుతున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు వైద్యుడి పనితీరుపై జిల్లాస్థాయి అధికారులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. నిబంధనల ప్రకారం వైద్యశాల పరిధిలోని పల్లెలతో పాటు పట్టణంలో క్యాంప్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా ఈ వైద్యుడి ఆధ్వర్యంలో ఒక్క క్యాంపు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇటీవల కంటి వెలుగు విధులకు గైర్హాజరు కావడంతో జిల్లా పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ ఈ వైద్యుడికి మెమో సైతం జారీచేసి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో మచ్చిక చేసుకొని చర్యలు లేకుండా చూసుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి.
* పిట్లంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద విధులు నిర్వహిస్తున్న ఓ ఒప్పంద వైద్యుడు సైతం వారానికి ఒకటి రెండు రోజులే విధులు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వైద్యుడికి ఎల్లారెడ్డి ఆయుష్‌ ఆసుపత్రి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా.. ఆయా ఆసుపత్రిలో గత ఏడాది కాలంగా ఓపీ నిర్వహించిన దాఖలాలు లేవు.
* ఔషధాలు పంపిణీ చేయవద్దని ఆయుష్‌ వైద్యశాఖ నిర్దేశించిందని చెబుతూ.. రాజంపేట మండలం ఆర్గోండ ఆయుష్‌ వైద్యశాలలో ఫార్మాసిస్టు పదిరోజులకోసారి విధులకు హాజరవుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.


ఫిర్యాదులపై చర్యలకు నివేదించాం
- డాక్టర్‌ రవి నాయక్‌, ఆర్‌డీడీ, వరంగల్‌

జిల్లాలోని ఆయుష్‌ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంపై ఫిర్యాదులున్న మాట వాస్తవమే. బాన్సువాడ యునానీ వైద్యుడి పనితీరుపై పలు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. నిబంధనలకు అనుగుణంగా ఆయుష్‌ పరిధిలోని విభాగాల వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు