logo

అభివృద్ధి పథంలో ఇందూరు

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు

Published : 03 Jun 2023 05:50 IST

పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు

రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఆయన మాటల్లోనే...

వ్యవసాయం

జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. 2014 సంవత్సరంలో 4.14 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండేది. తొమ్మిదేళ్ల కాలంలో 1.26 లక్షలు పెరిగి.. ప్రస్తుతం 5.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రతి అయిదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి చొప్పున 106 మంది నియమితులయ్యారు. రూ.23.32 కోట్లతో 106 రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి.

పౌర సరఫరాలు

2014-15 నుంచి 2022-23 వరకు 75.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా.. రూ.13,687 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమయ్యాయి. రాష్ట్రం మొత్తంలో సేకరించిన ధాన్యంలో జిల్లా వాటా 11 శాతం కావడం విశేషం. 4,02,463 మంది ఆహార భద్రత కార్డుదారులు నెలకు ఆరుకిలోల చొప్పున ఉచిత బియ్యం అందుకుంటున్నారు.

ఉద్యాన, మత్స్య శాఖలు

2022-23 సంవత్సరంలో ఆయిల్‌పాం సాగు 2632.25 ఎకరాల్లో మొదలైంది. ఈమేరకు 948 మంది రైతులకు రూ.3.36 కోట్ల మేర రాయితీ అందింది. పోచంపాడ్‌ ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి తొమ్మిదేళ్ల కాలంలో కోటి చేప పిల్లల లక్ష్యానికి గాను 92.66 లక్షల ఉత్పత్తి జరిగింది.

ఈ నెల 9 నుంచి గొర్రెల పంపిణీ

మొదటి దశలో 10,722 గొర్రెలను పంపిణీ చేయగా.. వాటికి సర్కారు రూ.139.35 కోట్లు వెచ్చించింది. రెండో దశలో జూన్‌ 9 నుంచి 8,384 జీవాల అందజేత ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సంచార పశు వైద్యశాల ఏర్పాటు చేసి పశువులకు వైద్యం అందిసున్నాం.

రహదారుల విస్తరణ

గత అరవై ఏళ్ల్లుగా జిల్లాలో 380 కి.మీ. మేర డబుల్‌ లైన్‌ రహదారులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో 566 కి.మీ. అదనంగా నిర్మితమయ్యాయి. రూ.905 కోట్లతో 79 రహదారి పనులు 566 కి.మీ.ల పొడవుతో మంజూరు కాగా.. రూ.782 కోట్ల వ్యయంతో 504 కి.మీ. మేర పూర్తిచేశాం.

లోవోల్టేజీకి పరిష్కారం

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో రూ.372.87 కోట్ల వ్యయంతో అదనంగా నియంత్రికలు, విద్యుత్తు లైన్లు వేయడంతో లోవోల్టేజీ సమస్య అనేది లేకుండా పోయింది. రూ.160 కోట్లతో కొత్తగా నాలుగు 220 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటయ్యాయి. రూ.5 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వచ్చింది.

జలవనరులు..

2014 నుంచి 22 వరకు భారీ మధ్య తరహా, చిన్న నీటిపారుదల చెక్‌డ్యాంలు, చిన్ననీటి ఎత్తిపోతల పథకాలు, పుష్కరఘాట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3,894.18 కోట్లు ఖర్చు చేసింది. మిషన్‌ కాకతీయ ద్వారా రూ.348.53 కోట్లతో 841 చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయి.

పల్లె, పట్టణ ప్రగతి

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో 14 మండలాలు, 137 పంచాయతీలు అదనంగా ఏర్పడ్డాయి. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పట్టణాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆసరా పింఛనర్లు 2,78,512 మంది ఉండగా.. వారికి ప్రతినెల సర్కారు రూ.55.86 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, అదనపు పాలనాధికారులు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, అదనపు సీపీ గిరిరాజా, డీఎఫ్‌వో వికాస్‌ మీనా, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, మేయర్‌ నీతూకిరణ్‌, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు