logo

మీలో మార్పు కోరుకుంటూ వెళ్లొస్తా..!

పది రోజులుగా మీ అభిమానం, భక్తి పారవశ్యం చూసి ముగ్దుడనయ్యాను. నన్ను భువిలోకి స్వాగతించడానికి పక్షం రోజులు మీరు పడిన శ్రమ హృదయాన్ని తాకింది. ప్రతిష్ఠాపన నుంచి నియమనిష్ఠలతో చేసిన పూజా సేవలు అద్భుతం.

Updated : 27 Sep 2023 08:54 IST

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే

ప్రియ భక్తులకు...

పది రోజులుగా మీ అభిమానం, భక్తి పారవశ్యం చూసి ముగ్దుడనయ్యాను. నన్ను భువిలోకి స్వాగతించడానికి పక్షం రోజులు మీరు పడిన శ్రమ హృదయాన్ని తాకింది. ప్రతిష్ఠాపన నుంచి నియమనిష్ఠలతో చేసిన పూజా సేవలు అద్భుతం. విఘ్నాలను తొలగించడానికి వచ్చిన నేను నా ధర్మాన్ని అనుసరించి ఈ సారి మనిషి జీవన విధానంపై దృష్టి నిలిపాను. సమాజంలో పరిణామాలు, దుర్ఘటనలు, వివిధ సమస్యలు ప్రజలను సతమతం చేస్తున్నాయని స్పష్టమైంది. విఘ్నాలు దూరమవడానికి జీవన విధానంలో మార్పులు అనివార్యమని గుర్తించాను. తరతరాలుగా ధర్మం నేర్పినవి అనుసరించడంలో వెనకబడిన అంశాల్లో మార్పు కోసం కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను.


పర్యావరణం

జలవనరులు, వృక్షాలు, అడవులు సంరక్షిస్తేనే మానవ మనుగడ. సాగుతో భూమిలోకి ఇంకిస్తున్న రసాయన ఎరువుల నుంచి వ్యర్థాలతో జలవనరుల కలుషితం, వృక్షాల నరికివేత, వాయు కాలుష్యం... ఇవన్నీ నేటి వాతావరణ మార్పులకు కారణం. రాబోయే భారీ విపత్తుల నుంచి రక్షణ కావాలంటే ఇప్పటి నుంచైనా ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోండి.


బద్ధకం వీడండి

వ్యక్తి విజయానికి దోహదం చేసేది క్రమశిక్షణ. నిద్రలేచి వ్యాయామం మొదలు నిద్రించేవరకు సమయానుకూలంగా పనులు నిర్వర్తించాలి. వ్యాయామం, ధ్యానం, నడక శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు. నిద్రలేచే మొదలు తలపెట్టిన పనుల పూర్తిలో బద్ధకం వీడాలి.


సమయపాలన

కాలయాపన చాలా మందిలో ప్రధాన లోపంగా మారింది. విద్యార్థులు విద్యాసంవత్సరం ప్రారంభంలో కాలయాపన చేసి పరీక్షల సమయంలో సిలబస్‌ అంతా నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఫలితాలపై అంచనాకు వచ్చి ఒత్తిడిలో తనువు చాలిస్తున్నారు. క్రమపద్ధతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. అధికారులు, నాయకులు రహదారి నిర్మాణాల్లో చేస్తున్న జాప్యం ప్రాణాపాయంగా మారుతోంది. దీనిని నిలువరించాలి.


ఆర్థిక ప్రణాళికలు

అప్పులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుర్ఘటనలు కలచివేశాయి. అత్యాశ, విచ్చలవిడి వ్యయాలు ఆర్థిక కష్టాలకు కారణం. వచ్చే ఆదాయాన్ని సమర్థవంతంగా ఖర్చు చేసే పరిజ్ఞానం పెంచుకోవాలి. అవసరమేదనే గ్రహించే విజ్ఞానం అవసరం. ముఖ్యంగా బెట్టింగ్‌లు, జూదం, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే కోరిక అప్పులు చేయడానికి ప్రేరేపిస్తోంది. చిన్నప్పటి నుంచి డబ్బు  విలువ తెలియజేస్తూ, పొదుపు నేర్పించండి. అప్పు ఎలా ముప్పుగా మారుతుందో అర్థం చేయించాలి.


మానవ విలువలు

తల్లిదండ్రులే సర్వమని నమ్మి ఆది పూజలందుకునే అర్హత పొందాను. ప్రస్తుత పరిస్థితులు సమాజంలో భిన్నంగా ఉన్నాయి. మాట వినకపోవడం, వృద్ధాప్యంలో నిరాదరణ, ఆస్తి కోసం హత్య చేయడం వంటివి కలచివేశాయి. ఈ విషయంలో మార్పు తప్పనిసరి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, తోటి మనుషులతో ప్రేమతో మెలగాలి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి.


వ్యసనాలకు దూరం

ప్రస్తుతమున్న దురలవాట్లకు తోడుగా డిజిటల్‌ వ్యసనం వచ్చి చేరింది. ఒక్క క్షణం గ్యాడ్జెట్లు కనిపించకపోతే భరించలేకపోతున్నారు. అంతలా బానిసలయ్యారు. నెమ్మదిగా తెర సమయం తగ్గించుకోవడానికి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. పక్కనే ఉన్నా మనుషులతో సంబంధం లేకుండా పోయిన తరుణంలో కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్నాయని గ్రహించండి.


వ్యక్తిగత, పరిసరాల శుభ్రత

ఈ సారి చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యంతో కనిపించారు. ఎవరో వస్తారని వేచి చూడకుండా పరిసరాల్లో, ఇంట్లో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి. వ్యక్తిగతంగానూ శుభ్రత పాటిస్తే ప్రయోజనం. అనారోగ్యం బారిన పడితే పనిదినాలు కోల్పోవడం, చికిత్స ఖర్చులతో ఆర్థికం భారం పడుతుందని గ్రహించండి.


నైతిక విలువలు

వ్యాపారం, ఉద్యోగం, కుటుంబంలో నైతికత అత్యావశ్యకం. నమ్మకానికి తిలోదకాలిచ్చి పరస్పరం మోసం చేసుకునే తీరు బాధాకరం. తినే ఆహారంలో కల్తీ, లంచావతారులు, వివాహేతర సంబంధాలు వంటివి సామాజిక విలువలను దిగజారుస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం ఎవరికి వారే ఆత్మపరీక్ష చేసుకోవాలి.


వారసత్వం

ఆచార, సంప్రదాయాల వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో కృషి చేయాలి. అది వ్యక్తిగత, కుటుంబ, సామాజిక అనుబంధాలు కావొచ్చు. ఇతర అంశాల్లో వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి కృషి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని