logo

యవ్వనంలో ఇళ్లు వీడి.. వృద్ధుడిగా తిరిగి చేరి.

సుమారు అయిదు దశాబ్దాల క్రితం ఉద్యోగ వేటలో ఇంటి నుంచి రాష్ట్రేతర ప్రాంతానికి వెళ్లిన సిమాంచల రణా (70) వృద్ధాప్యం మీద పడిన తర్వాత సొంత గూటికి చేరుకున్న సంఘటన గంజాం జిల్లా దిగపొహండి సమితిలోని సహదేవ్‌ టికరపడ గ్రామంలో చోటు చేసుకుంది. ఇవీ వివరాలు.. గ్రామంలోని

Updated : 18 Jul 2021 10:01 IST


సిమాంచల రణా

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: సుమారు అయిదు దశాబ్దాల క్రితం ఉద్యోగ వేటలో ఇంటి నుంచి రాష్ట్రేతర ప్రాంతానికి వెళ్లిన సిమాంచల రణా (70) వృద్ధాప్యం మీద పడిన తర్వాత సొంత గూటికి చేరుకున్న సంఘటన గంజాం జిల్లా దిగపొహండి సమితిలోని సహదేవ్‌ టికరపడ గ్రామంలో చోటు చేసుకుంది. ఇవీ వివరాలు.. గ్రామంలోని గోకర్ణేశ్వర మందిరం అర్చకునిగా సేవలందించే సిమాంచల రణాకు 1968లో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె జన్మించింది. తర్వాత ఉద్యోగం కోసం 1970లో ఆయన మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ ఓ గుత్తేదారు వద్ద కొన్నాళ్లు పనిచేశారు. అక్కడ ఇమడలేక రణా సొంతూరుకు బయలుదేరి, పొరపాటున బ్రహ్మపురకు బదులు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చేరుకున్నారు. బాల్యంలో ఓ దుర్ఘటనలో తలపై గాయమైన ఆయన తరచూ విభిన్నంగా ప్రవర్తించేవారు. సుమారు అయిదు దశాబ్దాలు బుర్హాన్‌పూర్‌లో ఉన్న రణాకు కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన రోటీ బ్యాంక్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సంజయ్‌ షిండే ఆహారం, వసతి సౌకర్యం కల్పించారు. మాటల్లో తనది గంజాం అని ఆయన చెప్పేవారు. షిండే ఇండియా కేర్స్‌ స్వచ్ఛంద సంస్థ, కటక్‌లోని తనకు తెలిసిన మిత్రునికి ఆయన గురించి చెప్పి, ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఒడిశాకు చెందిన ఐపీఎస్‌ సీనియర్‌ అధికారి అరుణ్‌ భొత్రా చొరవతో గంజాం ఎస్పీ బ్రిజేష్‌ రాయ్‌ కృషి ఫలితంగా ఎట్టకేలకు రణా సొంతూరు సహదేవ్‌ టికరపడగా గుర్తించారు. వీడియో కాల్‌ ద్వారా గ్రామంలోని ఆయన అన్నయ్య తదితరులకు ఆయనను చూపించారు. వారు గుర్తించిన తర్వాత సమీప బంధువులు బుర్హాన్‌పూర్‌ వెళ్లి గురువారం సొంతూరు తీసుకువచ్చారు. యాభై ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన రణాను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఆయన భార్య, కుమార్తె మరణించారు. ప్రస్తుతం ఆయన బంధువుల ఇంట్లో ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని