ఐదేళ్లుగా చెట్టుపైనే జీవనం
మంచి నీళ్లు తీసుకుని నిచ్చెన ఎక్కుతూ..
కటక్, న్యూస్‌టుడే : ఏనుగుల భయంతో.. మూడు కుటుంబాలు ఐదేళ్లుగా చెట్టుపై నివసిస్తున్నాయి. కేంఝర్ జిల్లా జుంపుర సమితి సనొజోడి గ్రామం అడవికి దగ్గరగా ఉండడంతో గజరాజులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం కాగానే గ్రామంలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. పక్కా ఇళ్లు ఉన్నవారు కొంచెం ధైర్యంగా ఉన్నా.. గుడిసెల్లో ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణాన ఏనుగులు వచ్చి దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. అటవీ అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏనుగుల నుంచి రక్షించుకునేందుకు మూడు కుటుంబాలు చెట్టుపై గుడిసె వేసుకుని జీవిస్తున్నాయి. ఊరి చివర ఉన్న ఈ గుడిసెల్లో సాయంత్రం కాగానే మూడు కుటుంబాలు చేరుకుని మళ్లీ ఉదయం కిందకు దిగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ చెట్టుపై ఉంటున్న పెను బెహర అనే వ్యక్తి ‘ఈటీవీ భారత్’తో మాట్లాడారు. ప్రతిరోజు ఏనుగులు గ్రామంలో ప్రవేశిస్తున్నాయన్నారు. గతంలో మట్టి గోడలు ఉండే గుడిసెలో ఉండేవాళ్లమని, ఏనుగులు వాటిని కూల్చివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచి సహాయంతో ప్రధాన మంత్రి ఆవాస్ పథకంలో పక్కా ఇళ్లు మంజూరైందని, ఐదేళ్లు గడిచినా పూర్తిగా డబ్బులు అందకపోవడంతో గోడల వరకే ఇంటి నిర్మాణం జరిగి ఆగిపోయిందన్నారు. పగలంతా అదే ఇంటిపై పాలిథీన్ వేసుకుని ఉంటామని, సాయంత్రానికి చెట్టు పైకి వెళ్లిపోతామని తెలిపారు. స్థానిక అటవీ అధికారి డి.డి.హేమంత్‌ను ‘ఈటీవీ భారత్’ సంప్రదించగా చెట్లపై ఉంటున్న విషయం తమకు తెలియదన్నారు. ఈటీవీ భారత్ ద్వారా సమాచారం తెలిసిందని, తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఆ కుటుంబాలకు సహాయం చేస్తామని వెల్లడించారు.
చెట్టుపైన వేసుకున్న గుడిసె
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.