logo
Published : 30 Jun 2022 04:20 IST

నల్లన్నయ్య నవ రూపం.. భక్తుల తన్మయం

ఘనంగా నేత్రోత్సవం

పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం

పురుషోత్తముని దివ్య మంగళ రూపం

జగన్నాథుడి నవయవ్వన రూపం.. అద్వితీయం.. ఏడాదికోసారి ఏర్పాటయ్యే ఆ అవతారంలో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎదురుచూస్తారు. నేత్రోత్సవం రోజున రత్నసింహాసనంపై కొలువుదీరిన స్వామిని కనురాలా వీక్షిస్తారు. లోకనాయకుడి దివ్య మంగళ రూపాన్ని మదిలో నింపుకొంటారు. పురుషోత్తముడి దర్శనంతో తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నల్లనయ్య నేత్రోత్సవాన్ని భక్తులు వీక్షించలేకపోయారు. ఈసారి వారికి అపూర్వ అవకాశం దక్కింది.

ఉదయం నుంచే దర్శనాలు
ఉదయం 8 నుంచి ప్రత్యేక దర్శనాలు ప్రారంభమయ్యాయి. 9.30 గంటల వరకు ప్రత్యేక దర్శనాల టోకెన్లు కొనుగోలు చేసినవారికి అవకాశమిచ్చారు. తర్వాత ఉచిత (సాధారణ) దర్శనాలకు అనుమతించారు. 11.30 వరకు ఇది కొనసాగింది. అనంతరం పురుషోత్తముడి గోప్యసేవల దృష్ట్యా మధ్యాహ్నం 3 వరకు దర్శనాలు నిలిపివేశారు. తర్వాత ప్రారంభమైన దర్శనాలు సాయంత్రం 6 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 11 వరకు కొనసాగాయి.

నిర్ణీత వేళల్లో సేవలు
యంత్రాంగం ఆదేశాల నేపథ్యంలో సేవాయత్‌లు నిర్ణీత వేళల్లో జగన్నాథ, బలభద్ర, సుభద్రల సేవలు నిర్వహించారు. దీంతో అంతా సవ్యంగా సాగింది. పూరీ కలెక్టర్‌ సమర్థవర్మ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. మరీచికోట్‌ నుంచి సింహద్వారం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వరుస క్రమంలో భక్తులు ఆలయంలోకి వెళ్లారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు కనిపించింది.

మెరుగైన సౌకర్యాలు
ఎండ తీవ్రత, ఉక్కపోత కారణంగా భక్తులు అలసటకు లోనయ్యారు. యంత్రాంగం అన్నిచోట్లా తాగునీరు పంపిణీ చేసింది. నీరు పిచికారీ చేయించింది. కొన్ని సేవాసంస్థలు ఉచితంగా తాగునీటి సీసాలు పంపిణీ చేశాయి. బొడొదండో నుంచి గుండిచా మందిరం వరకు పారిశుద్ధ్యం పనులు నిత్యం చేస్తూ కనిపించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు పోలీసులు సాయమందించారు.

శ్రీక్షేత్రం ఆవరణలో భక్తులు


శ్రీక్షేత్రంలో ‘ఈనాడు’ (గురువారం)

శ్రీక్షేత్రంలో గురువారం ఉదయం 4 గంటలకు తలుపులు తెరుస్తారు.

4.15 గంటలకు ముగ్గురుమూర్తుల మంగళ హారతి, అబకాశ, మైలం సేవలు ఏర్పాటవుతాయి.

6.15కు సూర్య, ద్వారపాల పూజ.

7.30కు పురుషోత్తముడి గోపాలవల్లభ సేవ నిర్వహిస్తారు.

8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.  సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు  కొనసాగుతాయి.

తర్వాత ఆలయంలో సెనాపట, ఇతర గోప్య సేవల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తారు.

పుండరీకాక్ష.. పురుషోత్తమా.. భక్తవత్సలా.. భవబంధ విమోచనా.. దీనబంధూ.. శరణు శరణు అంటూ భక్తుల ప్రార్థనలతో బుధవారం విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం ప్రతిధ్వనించింది. జగన్నాథ నామస్మరణతో బొడొదండో మార్మోగింది. పక్షం రోజుల తర్వాత ఆషాడ అమావాస్యనాడు స్వామి రత్న సింహాసనంపై నవయవ్వన రూపం (నేత్రోత్సవం)లో భక్తులకు దర్శనమిచ్చారు. చూసినవారంతా తన్మయత్వానికి లోనయ్యారు. ‘అన్యధా శరణం నాస్తి... త్వమేవ శరణం మమ’ అంటూ పురుషోత్తముడిని ప్రార్థించారు.

15 రోజుల తర్వాత ‘ఒబడా’

పురుషోత్తముడు ఒనొసొనొ (చీకటి) మందిరంలో 15 రోజులున్నాడు. అనారోగ్యానికి గురైన స్వామికి ఒబడా (మహాప్రసాదం) అర్పణ చేయలేదు. చికిత్స, ఉపచారాలతో స్వామి కోలుకున్న తర్వాత బుధవారం మహాలక్ష్మి పాకశాలలో మహాప్రసాదం, ఇతర ప్రసాదాలు తయారుచేశారు. ముగ్గురు మూర్తులకు అర్పించిన తర్వాత ఆనందబజారులో భక్తులందరికీ అందుబాటులో ఉంచారు. గురువారం ఆషాడ శుక్ల పాఢ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో ‘ఉభా’ వేడుకలు ఏర్పాటవుతాయి. వరుసగా రెండోరోజు స్వామి నవయవ్వన దర్శనం, ఒబడా ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి.


అసౌకర్యాలకు తావు లేకుండా ఏర్పాట్లు
ప్రదీప్‌కుమార్‌ జెనా



ప్రభుత్వ సహాయ ప్రధాన కార్యదర్శి జెనా

పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం: విశ్వప్రసిద్ధ రథయాత్ర దృష్ట్యా ప్రభుత్వం పూరీలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, అసౌకర్యాలకు తావు లేదని ప్రభుత్వ సహాయ ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్‌) ప్రదీప్‌కుమార్‌ జెనా తెలిపారు. బుధవారం ఆయన రథయాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించి, శ్రీక్షేత్రం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. యంత్రాంగం పారిశుద్ధ్యం, తాగునీరు, వసతి, భద్రతకు ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు భక్తులు గుండిచా సంబరాలు తిలకించలేకపోయారని, ఈ ఏడాది పురుషోత్తముని కృపతో యాత్ర చూసే భాగ్యం కలిగిందన్నారు. 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు.

205 రైళ్లు.. 1000 బస్సులు..
తూర్పుకోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోందని, వెయ్యి బస్సులు పూరీకి రాకపోకలు సాగిస్తాయని ఏసీఎస్‌ జెనా పేర్కొన్నారు. భక్తులకు అన్నివేళలా వైద్యం అందుబాటులో ఉందని, పూరీ ఆసుపత్రిలో 24్ల7 సేవలు అందిస్తున్నామన్నారు. కొవిడ్‌ మహమ్మారి అంతరించలేదని, ఉత్సవాలకు వస్తున్న యాత్రికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. అందరూ కొవిడ్‌ నియమావళి పాటించి వేడుకలు తిలకించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే సమాచార కేంద్రాలకు లేదా పోలీసు పోస్టుల వద్దకు వెళ్లి తెలియజేయాలన్నారు.


ఆరోగ్య సేవలకు సిద్ధం

‘న్యూస్‌టుడే’తో పూరీ జిల్లా ప్రధాన వైద్యాధికారిణి


డాక్టర్‌ సుజాత మిశ్ర

పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం: పూరీ ఆసుపత్రిలో రక్తం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆపత్కాల సేవలకు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా ప్రధాన వైద్యాధికారిణి డాక్టర్‌ సుజాత మిశ్ర చెప్పారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. పూరీ ప్రధాన ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో తాత్కాలికంగా వైద్య నిపుణులను నియమించినట్లు తెలిపారు. వడదెబ్బ చికిత్సకు 12 ఐసీయూ, సర్జరీ కోసం 6 వార్డులు సిద్ధంగా ఉంచామన్నారు. 200 యూనిట్ల రక్తం ఉందని, అవసరమైతే భువనేశ్వర్‌ నుంచి తెప్పించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రధాన కూడళ్లలో తాత్కాలిక వైద్య కేంద్రాలు ప్రారంభించామని, ఆయాచోట్ల కొవిడ్‌ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. గురువారం నుంచి పూరీకి వచ్చే యాత్రికులందరికీ ఉచితంగా మాస్కులు అందజేయడానికి ఏర్పాటు చేశామన్నారు. పట్టణ పరిధిలోని అల్పాహార, భోజనశాలల్లో తనిఖీల కోసం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించినట్లు తెలిపారు. యాత్రికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అత్యవసర సేవలకు అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని సుజాత మిశ్ర తెలిపారు.


ప్రత్యేక ఆకర్షణ శక్తిపీఠం

బట మంగళ ఆలయం

పూరి నుంచి న్యూస్‌టుడే బృందం: జగన్నాథుడి రథయాత్రలో భాగంగా పూరీ ప్రవేశ మార్గంలో ఉన్న శక్తిపీఠం బట మంగళ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యాత్ర జరిగే సమయంలో ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా సందర్శిస్తారు. భక్తులు పట్టణంలోకి ప్రవేశించే ముందు ఈ ఆలయం వద్ద ఆగి దేవిని దర్శించుకుంటారు. జగన్నాథుడి దర్శనం బాగా జరగాలని అమ్మవారిని పూజిస్తారు. దేవి అనుమతి తీసుకుని జగన్నాథ సన్నిధికి వెళ్తే స్వామి దర్శనం సులువుగా జరుగుతుందని భక్తుల విశ్వాసం. యాత్ర దృష్ట్యా ఆలయాన్ని అందంగా అలంకరించారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని