logo

ప్రమాద రహితంగా రహదారులు, డ్రైనేజీలు

రానున్న సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు ప్రమాద రహితంగా ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని పట్టణ స్థానిక సంస్థలకు

Published : 30 Jun 2022 04:20 IST

పట్టణ స్థానిక సంస్థలకు సర్కార్ దిశానిర్దేశం

పాతగేటు కూడలి వద్ద ఫుట్‌పాత్‌పై విరిగిన పలక

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే:  రానున్న సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు ప్రమాద రహితంగా ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని పట్టణ స్థానిక సంస్థలకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి మథివధనన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లు, మున్సిపాలిటీ నగర పంచాయతీల కార్యనిర్వాహణ అధికారులు తాజాగా లేఖలు రాశారు. వర్షాకాలంలో ప్రజల భద్రతని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా డ్రైనేజీలను పలకలతో కప్పి ఉంచాలని లేఖలో పేర్కొన్నారు. గోతులమయమైన రహదారులపై వర్షపునీరు నిలిచి ప్రమాదాలకు ఆస్కారమున్న నేపథ్యంలో అలాంటి వాటిపై దృష్టిసారించాలని లేఖలో వెల్లడించారు. ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అవసరమైతే కొత్తగా నిర్మాణాలు, లేదా మరమ్మత్తులు చేపట్టాలని అందులో ప్రస్తావించారు. వర్షాల సమయంలో డ్రైనేజీల ద్వారా వర్షపునీరు సక్రమంగా పారుతుందోలేదో పరిశీలించాలని లేఖలో స్పష్టం చేశారు.

జూన్‌ 30లోగా సిద్ధం చేయాలి
తమ పరిధిలోని రహదారులు డ్రైనేజీల పరిస్థితికి సంబంధించి నివేదిక జూన్‌ 30లోగా సిద్ధం చేయాలని పట్టణాభివృద్ధిశాఖ యూఎల్‌బీలకు సూచించింది. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని పేర్కొన్న సర్కార్‌ అందులో సంబంధిత వార్డు కమిటీ, మిషన్‌శక్తి బృందాలు సమాఖ్యలను భాగస్వామ్యులు చేయాల్సిందిగా వెల్లడించింది. ప్రమాదకర ప్రాంతాలవద్ద సూచీ బోర్డులను తప్పకుండా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొంది. గతంలో ఇలాంటి వాటివల్ల చోటుచేసుకున్న ప్రమాదాలు, కొద్దిపాటి మరణాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడంతో పాటు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయని మథివధనన్‌ లేఖలో ప్రస్తావించారు. వాటి ఫలితంగా మానవ హక్కుల కమిషన్లో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని