logo

పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం

ఒడిశాలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. బుధవారం దుబాయ్‌లో నిర్వహించిన ‘మేకిన్‌ ఒడిశా’

Published : 30 Jun 2022 04:20 IST

పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం
దుబాయ్‌ ‘మేకిన్‌ ఒడిశా’ సదస్సులో సీఎం నవీన్‌

యూసఫ్‌ అలీ హమీదితో చర్చిస్తున్న ముఖ్యమంత్రి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. బుధవారం దుబాయ్‌లో నిర్వహించిన ‘మేకిన్‌ ఒడిశా’ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడిదారులకు భద్రత, సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తమది శాంతియుత రాష్ట్రమని, స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. కొవిడ్‌ సమయంలో రాష్ట్రానికి రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉక్కు, అల్యూమినియం, పెట్రోకెమికల్స్‌, విద్యుత్తు, ఐటీ, పర్యటకం, మత్స్య ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. కువైట్‌కు చెందిన ఎంబీటీసీ గ్రూపు సంస్థల అధిపతి కె.జి.అబ్రహం, టబ్రీడ్‌ గ్రూపు చైర్మన్‌ డాక్టర్‌ యూసఫ్‌ అలీ హమీది తదితర ప్రముఖులతో నవీన్‌ చర్చించారు. కార్యక్రమంలో ఆహార పౌరసరఫరాల మంత్రి అతాను సవ్యసాచి నాయక్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, పౌరసరఫరాల ప్రిన్సిపల్‌ కార్యదర్శి వీర్‌విక్రం యాదవ్‌, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దుబాయ్‌లోని ఒబెరాయ్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ వేదికగా ఏర్పాటైన సదస్సులో మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. దీనికి ముందుగా దుబాయ్‌లో ఉన్న కొందరు ఒడియా ప్రముఖులు నవీన్‌ను కలసి మాట్లాడారు. మాతృభూమి (ఒడిశా) కోసం తమ వంతు సహకరిస్తామని, మో కాలేజ్‌, మో స్కూల్‌ కార్యక్రమాలకు నిధులు అందజేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని