logo
Published : 06 Aug 2022 01:56 IST

పెరిగిన ధరలపై కాంగ్రెస్‌ గర్జన

దేశ ఆర్థిక పరిస్థితి బాగుందన్న భాజపా

ధరల పెరుగుదల బాధాకరమన్న బిజద

రాజ్‌భవన్‌ వద్ద పోలీసుల బ్యారికేడ్లపై శరత్‌, హరిచందన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: నిత్యావసరాల ధరల పెరుగుదల, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) భారానికి నిరసననగా కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌ రాజ్‌భవన్‌ ప్రాంగణంలో పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌, మాజీ అధ్యక్షుడు ప్రసాద హరిచందన్‌, ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్‌ ఎక్కిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పేదల బతుకులు భారం

పీసీసీ అధ్యక్షుడు పట్నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ... నరేంద్రమోదీ పాలనలో పేదల బతుకులు భారంగా మారాయని, ధరల పెరుగుదలతో వారి కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. ఉపాధి లేక యువత అలమటిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కేంద్రం జీఎస్టీ కొరడా ఝుళిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోయిందని ఆరోపించారు.

దేశ పరిస్థితి బాగుంది

కాంగ్రెస్‌ ఆందోళనపై రాష్ట్ర భాజపా కార్యదర్శి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల్లో యుద్ధ మేఘాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో పరిస్థితి బాగుందన్నారు. దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని, దేశ గౌరవ ప్రతిష్టలు పెంచిన మోదీపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు

నిత్యావసర సామగ్రి ధరలు, జీఎస్టీ తదితరాలన్నీ కేంద్రం పరిధిలోనివని, బిజద అధికార ప్రతినిధి, మాజీ ఆర్థికశాఖ మంత్రి శశిభూషణ్‌ బెహర విలేకరులకు చెప్పారు. ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదని, ధరల పెరుగుదల తమకు బాధగా ఉందని, దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు నవీన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు.
 

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని