logo

కొరాపుట్‌లో స్తంభించిన జనజీవనం

కొరాపుట్‌ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలో ఆదివారం 486.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Published : 08 Aug 2022 06:53 IST


లిమిక వద్ద కల్వర్టు పైనుంచి వరద పరవాహం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలో ఆదివారం 486.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. దశమంత్‌పూర్‌లో అత్యధికంగా 63.0 మి.మీ., పొట్టంగిలో అత్యల్పంగా 8.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొరాపుట్‌ సమితిలోని లిమిక గ్రామంలో కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిసర ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి. నందపూర్‌ ఠాణా మార్గంలోనూ రోడ్డు నీరు ప్రవహించింది. వర్షం కారణంగా వారపు సంతలు బోసిపోయాయి. అటవీ ఉత్పత్తుల విక్రయాలు సాగక గిరిజనులు ఉసూరుమంటూ ఇళ్లకు వెనుదిరిగారు.

నీట మునిగిన పొలాలు
గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం, పద్మపురం ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటీవలే రైతులు నాట్లు పూర్తి చేయగా ఆ పొలాలన్నీ నీట మునిగాయి. వివిధ ప్రాంతాల్లో చెరువులు, కాల్వల గట్లు తెగిపోయాయి. పద్మపురంలోని సునారిఘాయి కూడలికి సమీపంలో చెరువు గట్టు కోతకు గురై పొలాల్లోకి నీరు చేరింది. లవుగుడ, ఇందుపురం ప్రాంతాల్లో అధిక శాతం పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లవుగుడ సమీపంలో మైనర్‌ కాల్వకు గండి పడటంతో ఓ వీధిలో నీరు చేరింది. ఓవైపు ఇప్పటివరకు నీరు లేక ఆలస్యంగా వరి నాట్లు వేయగా తాజా వర్షాలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.


పద్మపురం సమీపంలో పొల్లాల్లోకి చేరిన నీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని