logo

ఇళ్లిస్తాం... సీఎం హామీ ఇవ్వాలి..

అర్హులకే ఇళ్లు కేటాయిస్తామని, అవినీతి, అక్రమాలకు తావీయబోమని, నిర్మించే ఇళ్ల గోడలపై ‘ఆవాస్‌’ లోగో ముద్రిస్తామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, ఆ తర్వాతే రాష్ట్రానికి 8 లక్షల ప్రధానమంత్రి

Published : 12 Aug 2022 01:37 IST

స్పష్టం చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌

గిరిరాజ్‌ సింగ్‌తో ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రదీప్‌ అమత్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అర్హులకే ఇళ్లు కేటాయిస్తామని, అవినీతి, అక్రమాలకు తావీయబోమని, నిర్మించే ఇళ్ల గోడలపై ‘ఆవాస్‌’ లోగో ముద్రిస్తామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, ఆ తర్వాతే రాష్ట్రానికి 8 లక్షల ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ఇళ్లు కేటాయిస్తామని కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను దిల్లీలో కలిసిన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ప్రదీప్‌ ఆయనతో కలసి గిరిరాజ్‌ కార్యాలయానికి వెళ్లారు. రెండేళ్లుగా ఆవాస్‌ గృహాలు కేటాయించకపోవడంతో నిరాశ్రయులు ఇబ్బందులు పడుతున్నారని అమత్‌ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గిరిరాజ్‌ మాట్లాడుతూ గతంలో ఈ పథకం కింద మంజూరైన ఇళ్లు దుర్వినియోగమయ్యాయని, అనర్హులకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయిందన్నారు. ఆయనతో ఏకీభవించిన రాష్ట్ర మంత్రి అమత్‌ అవకతవకలు బయట పడిన తర్వాత ప్రభుత్వం 22 మంది అధికారులపై చర్యలు తీసుకుందని, తప్పిదాలు పునరావృతం కావని తెలిపారు. అనంతరం గిరిరాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ అర్హులకు (పేదలు) గృహాలు కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ విషయం రాష్ట్ర మంత్రికి తెలియజేశామన్నారు. ఇళ్లు కేటాయించడానికి ముందుగా ముఖ్యమంత్రి తమ కార్యాలయానికి లేఖ రాయాలని, తప్పిదాలు పునరావృతం కావని స్పష్టం చేయాలన్నారు. సీఎం నుంచి లేఖ అందిన తర్వాత పెండింగులో ఉన్న 8 లక్షల ఇళ్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి అమత్‌ మాట్లాడుతూ ఇళ్ల విషయమై ఆశావహ చర్చలు జరిగాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని