logo

రాచరికం వదిలి... స్వాతంత్ర్య ఉద్యమానికి కదిలి...

వీర సురేంద్రసాయి.. ఈ విప్లవ వీరుడు రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు. పశ్చిమ ఒడిశావాసులు ఇంటింటా ఆయన పేరిట నిత్యం జ్యోతి వెలిగించి ఆరాధిస్తారు. మహోన్నత ఆశయం కోసం తనను తాను సమర్పించుకున్న అమరజీవి. స్వాతంత్య్ర సంగ్రామంలో

Published : 12 Aug 2022 01:37 IST

విప్లవ వీరుడు వీర సురేంద్రసాయి

అమర వీరునికి ఇంటింటా పూజలు

న్యూస్‌టుడే, భువనేశ్వర్‌

వీర సురేంద్రసాయి.. ఈ విప్లవ వీరుడు రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు. పశ్చిమ ఒడిశావాసులు ఇంటింటా ఆయన పేరిట నిత్యం జ్యోతి వెలిగించి ఆరాధిస్తారు. మహోన్నత ఆశయం కోసం తనను తాను సమర్పించుకున్న అమరజీవి. స్వాతంత్య్ర సంగ్రామంలో సురేంద్ర సాయి చూపిన సాహసం, తెగువ చిరస్మరణీయం. స్వతంత్ర భారతి 75 వసంతాల పండగ నేపథ్యంలో ఆయనను స్మరించుకోవడం జాతికి గర్వకారణం.

సంబల్‌పూర్‌ ప్రధాన మార్గంలో వీర సురేంద్రసాయి కాంస్య విగ్రహం

రాజవంశంలో జననం
1809 జనవరి 23న సంబల్‌పూర్‌ జిల్లా రెంగాలి సమితిలోని ఖుంటా గ్రామంలో రాజ వంశంలో జన్మించారు సురేంద్రసాయి. ఊహ తెలిసినప్పటి నుంచే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకించిన ఆయన పశ్చిమ ఒడిశా జిల్లాల్లో విప్లవ జ్యోతులు వెలిగించి యువకులకు కత్తిసాము, ఆయుధాల ప్రయోగం, గుర్రం స్వారీ తదితర విద్యల్లో శిక్షణ ఇచ్చి వారితో కలసి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. రాజుగా సింహాసనం అధిరోహించాల్సి ఉన్న సాయి సర్వస్వం త్యజించి పోరుబాట పట్టారు. 1827 నుంచి 1840 వరకు (13 ఏళ్లు) బ్రిటీష్‌ సేనలను ముప్పుతిప్పలు పెట్టిన ఆయనను కపట నాటకంతో పాలకులు బంధించి హత్యా నేరం మోపి హజారీబాగ్‌ కారాగారంలో నిర్బంధించారు. 1840 నుంచి 1857 వరకు (17 ఏళ్లు) జైల్లోనే ఉన్నారు. అప్పుడే దేశవ్యాప్తంగా సిపాయి తిరుగుబాటు ప్రారంభమైంది. దీన్ని అవకాశంగా తీసుకున్న సాయి జైలు నుంచి తప్పించుకుని సంబల్‌పూర్‌ చేరుకున్నారు. విప్లవ వీరులను మళ్లీ చేరదీసి సిపాయి పోరాటం ఉద్ధృతం చేయించారు. అయిదేళ్ల కాలం ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయిన ఆయనను పట్టిచ్చేవారికి నజరానా చెల్లిస్తామని బ్రిటీష్‌ పాలకులు ప్రకటించారు. చివరికి ఆయనను బంధించడానికి సరికొత్త ఎత్తుగడ వేశారు. ఆ విప్లవ యోధుని ఆప్తమిత్రునికి ప్రలోభాలు చూపి లొంగదీసుకున్నారు. చివరికి స్నేహితుని వల్లే 1864లో ఆయన పట్టుబడ్డారు. ఏకంగా 20 ఏళ్లు (1864 నుంచి 1884) సంబల్‌పూర్‌కి చాలా దూరాన ఉన్న అసురఘడ్‌ దుర్గంలో బంధించారు. ఇక్కడ చీకటి గదిలో చిత్రహింసలకు గురైన సాయి 1884 ఫిబ్రవరి 28న కారాగారంలోనే తుదిశ్వాస విడిచారు. ఉత్కళ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు సేనానిగా ఆయన చిరస్మరణీయులు. వేలాదిమంది విప్లవ వీరులను తీర్చిదిద్దిన ఘనచరిత్ర ఈ అమర వీరునిదే.

సాయి గౌరవార్ధం విడుదలైన తపాలా బిళ్ల

మహా నాయకునికి నివాళిగా..
1954 సంబల్‌పూర్‌లో ఏర్పాటైన ఉత్కళ సమ్మేళనంలో పాల్గొన్న నాటి ప్రధాని దివంగత జవహర్‌లాల్‌ నెహ్రూ సురేంద్రసాయి కాంస్య విగ్రహానికి పుష్పగుచ్ఛాలు వేసి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో సుభాష్‌చంద్ర బోస్‌ తరహా యోధుడని కొనియాడారు. స్వాతంత్య్రానంతరం కేంద్రం సాయి పేరిట తపాలా బిళ్ల విడుదల చేసింది. సంబల్‌పూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రి స్టేడియం, ఇంజినీరింగ్‌ కళాశాలకు ఆయన పేరు పెట్టారు. సంబల్‌పూర్‌లో, భువనేశ్వర్‌లలో కాంస్య విగ్రహాలు ఏర్పాటయ్యాయి. రాజధాని (భువనేశ్వర్‌)లో ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. 2019 సంవత్సరాంతంలో ఝార్సుగుడ విమానాశ్రయం విస్తరణ తర్వాత ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ దానికి సురేంద్ర సాయి ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేశారు.

​​​​​​​

వీర సురేంద్రసాయి పేరిట సంబల్‌పూర్‌ (బుర్లా) వైద్య కళాశాల ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని