logo

పరుగులు తీస్తున్న పారిశ్రామిక రంగం

రాష్ట్రానికి మంచిరోజులొచ్చాయని, పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందని, పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్‌ దేవ్‌ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

Published : 12 Aug 2022 01:37 IST

రాష్ట్రానికి తరలివస్తున్న పెట్టుబడులు

మేకిన్‌ ఒడిశా సదస్సు తర్వాత ఉపాధికి బాటలు

సీఎం అధ్యక్షతన హెచ్‌ఎల్‌సీఏ సమావేశం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి మంచిరోజులొచ్చాయని, పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందని, పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్‌ దేవ్‌ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన లోక్‌సేవాభవన్‌లో హైలెవల్‌ క్లియరెన్స్‌ కమిటీ సమావేశమైంది. రూ.74,620.18 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం తర్వాత మంత్రి ప్రతాప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. నవంబరు నెలాఖరులో భువనేశ్వర్‌లో ఏర్పాటయ్యే మూడో మేకిన్‌ ఒడిశా సదస్సు రాష్ట్రాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుందన్నారు. ఈ సదస్సుకు ముందుగా ముఖ్యమంత్రి మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడిదారులతో చర్చిస్తారని, వారిని మేకిన్‌ ఒడిశా సదస్సుకు ఆహ్వానిస్తారని చెప్పారు.

ప్రతాప్‌ దేవ్‌


కాశీపూర్‌లో భారీ నిర్మాణం
బుధవారం రాత్రి హెచ్‌ఎల్‌సీఏ ఆమోదం తెలిపిన నిర్మాణాల వివరాలు ఇవీ...
రాయగడ జిల్లా కాశీపూర్‌లో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ.41,653 కోట్ల వ్యయంతో ఏడాదిలో 4 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల అల్యూమిన రిఫైనరీ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు 175 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల క్యాప్టిన్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రారంభిస్తుంది. 7750 మందికి ఉపాధి అవకాశాలుంటాయి.

 జాజ్‌పూర్‌ జిల్లా కళింగనగర్‌లో ఒడిశా అలయ స్టీల్‌ కంపెనీ రూ.8 వేల కోట్లతో ఏడాదిలో 2.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం, 370 మెగావాట్ల ఉత్పత్తి క్యాప్టివ్‌ విద్యుత్కేంద్రం ఏర్పాటు చేస్తుంది.

భద్రక్‌ జిల్లా ధమ్రాలో సోంపురి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గ్రూపు రూ.7811 కోట్ల వ్యయంతో పాలెట్‌ పరిశ్రమ, కేంఝర్‌లో రూ.4592.18 కోట్లతో పీవీసీ పైపుల నిర్మాణ కేంద్రం, ఇక్కడే (కేంఝర్‌) రూ.3674 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది.

టాటా స్టీల్‌, ఆరతీ స్టీల్‌ లిమిటెడ్‌, అర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌, డంగ్టా మెటల్స్‌ కంపెనీలు కటక్‌, మయూర్‌భంజ్‌, కేంఝర్‌లలో ఉక్కు, క్యాప్టివ్‌ పవర్‌ జనరేషన్‌, పీవీసీ పైపుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి.

సంబంధిత నిర్మాణాల కింద రూ.74,620.18 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 24,047 మందికి ఉపాధి అవకాశాలుంటాయి.

హెచ్‌ఎల్‌సీఏ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి హేమంత శర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని