logo

నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా నేడు (ఆగస్టు 12) నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో 1-19 ఏళ్ల చిన్నారులు, కౌమారులైన 1.68 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. బుధవారం జరిగిన మీడియా

Published : 12 Aug 2022 01:37 IST

రాయగడలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారితో మాత్రలు మింగిస్తున్న సిబ్బంది (పాత చిత్రం)

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా నేడు (ఆగస్టు 12) నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో 1-19 ఏళ్ల చిన్నారులు, కౌమారులైన 1.68 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. బుధవారం జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌ యునిసెఫ్‌ అధికారులు మాట్లాడుతూ.. చిన్నారులు నులిపురుగు నివారణ మందులు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆగస్టు నెలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంతోపాటు విటమిన్‌ ‘ఏ’ డోసు పంపిణీ కార్యక్రమాన్ని కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 30 జిల్లాల్లోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నట్లు ఆ శాఖ పేర్కొంది.

72 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో
కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు బిజయ్‌కుమార్‌ పాణిగ్రహి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 12న ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. 12న డోసులు తీసుకోలేకపోయిన చిన్నారులు ఆగస్టు 19న నిర్వహించే మరో రౌండ్‌లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఎస్‌డీడీ కింద 1,68,31,679 మంది లబ్ధిదారులు నులిపురుగు నివారణ మాత్రలు తీసుకుంటున్నట్లు పాణిగ్రహి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,500 పాఠశాలలు, 72 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకు 69 వేల మంది ఉపాధ్యాయులు, 72 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 48వేల మంది ఆశా కార్యకర్తలు, 7800 మంది ఏఎన్‌ఎంలు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. 9 నెలలు-5 ఏళ్ల లోపు చిన్నారులైన 35,19,554 మందికి విటమిన్‌ ‘ఏ’ డోసు సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని