logo

క్రైమ్‌ వార్తలు

కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ బస్టాండ్‌ వద్ద ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌లో బుధవారం రాత్రి చోరీయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒకరిని

Published : 12 Aug 2022 01:37 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: చంద్ర కోణా పట్టణంలోని ప్రధాన రహదారిపై కమర్‌ పాడా ప్రాంతంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రకోణా వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనానికి, మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక శిశువు, మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మిడ్నాపూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో తరలించారు.


చోరీ కేసులో ఒకరి అరెస్టు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ బస్టాండ్‌ వద్ద ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌లో బుధవారం రాత్రి చోరీయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సునాబెడ ఎస్‌డీపీవో మనోజ్‌ కుమార్‌ బెహరా విలేకరులకు వెల్లడించారు. బ్యాంకులో ప్రవేశించేందుకు యత్నించిన సమయంలో అలారం మోగిందని దీంతో ఒకరు పరారవగా, మరొకరు బ్యాంకులోనే దాక్కున్నాడని, కనుగొని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు బిజూ కాలనీకి చెందిన భుబన్‌ కుల్దీప్‌గా గుర్తించి, గురువారం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. బ్యాంకులో స్టాంప్‌లు, కొన్ని పత్రాలు చోరీకి గురయ్యాని, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బెహరా తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.


151 కిలోల గంజాయి స్వాధీనం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్‌ సమితి పాడువా ప్రాంతం నుంచి కలహండికి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. సిమిలిగుడ ఠాణాలో గురువారం సునాబెడ ఎస్‌డీపీవో మనోజ్‌ కుమార్‌ బెహరా అందించిన వివరాల ప్రకారం... ముందస్తు సమాచారంతో గురువారం తెల్లవారుజామున బోడో బొడింగ కూడలి వద్ద పాడువా వైపు నుంచి వస్తున్న కారును ఆపారు. అందులో తనిఖీ చేయగా 151 కిలోల గంజాయి గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. సరకు విలువ రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు.


సైబర్‌ నేరస్థుని వలలో ఇంజినీరు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బీఈఎంసీలో ఉప కార్యనిర్వాహక ఇంజినీరుగా పనిచేస్తున్న ఒకరు సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుకుని, రూ.లక్షకుపైగా పోగొట్టుకున్నారు. ఆయన ఇంటి విద్యుత్తు బిల్లు బకాయిలు చెల్లించకుంటే సాయంత్రంలోగా సరఫరా నిలిపివేస్తామంటూ మొబైల్‌ ఫోనుకు సంక్షిప్త సందేశం వచ్చింది. దీంతో ఆయన ఆ సందేశంలోని లింక్‌ను క్లిక్‌ చేయగా, సైబర్‌ నేరగాళ్లు ఓ యాప్‌ ద్వారా సొమ్ము చెల్లించాలంటూ ఆయన ఫోనుకు దాన్ని పంపారు. ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత తొలుత రూ.10లు చెల్లించాలని కోరారు. ఆయన డెబిట్‌ కార్డు ద్వారా సొమ్ము చెల్లించిన తర్వాత ఆయన బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతల్లో రూ.లక్షకుపైగా బదిలీ అయినట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.

గంజాం జిల్లా పురుషోత్తంపూర్‌ ఠాణా పరిధిలో సొలొఘరొ, సున్నాథర పంచాయతీల గ్రామ్‌ రోజ్‌గార్‌ సేవక్‌ (జీఆర్‌ఎస్‌) స్వాగత్‌ పండా సోమవారం రాత్రి బీడీఓను కలిసేందుకు వెళుతున్నట్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మరుసటి రోజు మంగళవారం ఆయన భార్య ఠాణాలో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆయన మొబైల్‌ ఫోను, ద్విచక్ర వాహనం పురుషోత్తంపూర్‌లోని రెండు వేర్వేరు చోట్ల లభించాయి. దీంతో మాయమైన జీఆర్‌ఎస్‌ ఘటన చర్చనీయాంశమైంది.


సారా తయారీ కేంద్రాలపై దాడులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి ఠాణ పరిధిలోని సింగిపురం, ఉద్దనగూడ, ఆనందపూర్‌, నమ్మనగూడ, సిద్ధమనుగు, కొర్సండ, నేరడిగూడ గ్రామాల్లోని సారా తయారీ కేంద్రాలపై అబ్కారీ అధికారులు దాడి చేశారు. 810 లీటర్ల నాటుసారా, 4000 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.


విద్యుదాఘాతంతో ఆవు మృతి

కాశీనగర్‌, న్యూస్‌టుడే: గజపతి జిల్లా గురండి ఠాణా పరిధిలోని మచ్చుమర గ్రామంలో విద్యుదాఘాతంతో గురువారం ఆవు మృతి చెందింది. నియంత్రిక చుట్టూ కంచె లేకపోవడంతో అటువైపు మేతకు వెళ్లి చనిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని