logo

మన్యం బిడ్డలు...పోరాట యోధులు

ఎందరో త్యాగధనుల పోరాటం ఈ 75 ఏళ్ల స్వాతంత్య్రం. తెల్లదొరలు అన్యాయంగా చేస్తున్న దాడులు భరించలేని ప్రజలు పిడికిలి బిగించి భారతీయుడి దెబ్బ చూపించిన ఘట్టాలు ఎన్నో. అలాంటి స్వాతంత్య్ర పోరాటంలో రాయగడ జిల్లా గుణుపురంలోని కుజింద్రి గ్రామంలోని గిరిజనులు పాల్గొన్నారు

Published : 13 Aug 2022 02:30 IST

గుణుపురం, న్యూస్‌టుడే

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న గుణుపురం, కుజింద్రి ప్రాంత సమర యోధులు నీలకంఠ గమాంగ్‌ ఇతరులు

ఎందరో త్యాగధనుల పోరాటం ఈ 75 ఏళ్ల స్వాతంత్య్రం. తెల్లదొరలు అన్యాయంగా చేస్తున్న దాడులు భరించలేని ప్రజలు పిడికిలి బిగించి భారతీయుడి దెబ్బ చూపించిన ఘట్టాలు ఎన్నో. అలాంటి స్వాతంత్య్ర పోరాటంలో రాయగడ జిల్లా గుణుపురంలోని కుజింద్రి గ్రామంలోని గిరిజనులు పాల్గొన్నారు. ఆదివాసీలు ఉండే ఈ గ్రామంలో బ్రిటీషు సైనికులు పన్నుల పేరిట హింసించడం, భూములను ఆక్రమించుకోవడం, ఆరుగాలం శ్రమించి పండించిన పంట దోచుకోవడంతో దాడి చేస్తే ఫలితం ఉండదని, శాంతియుత మార్గాన్ని ఎంచుకుని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రతిదాడి చేసేవారు కాదు
ఆంగ్లేయ సైనికులు శిస్తు కట్టాలని కుజింద్రికి వచ్చిప్పుడు మహిళలు, పురుషులు ఏకమై అడ్డగించేవారు. కోపంతో సైనికులు గిరిపుత్రులపై దాడులు చేసేవారు. అయినా శాంతియుతంగా పోరాడాలని నిర్ణయించుకున్న గిరిజనులు ప్రతి దాడి చేసేవారు కాదు. నిరక్షరాస్యులు కావడంతో మన్యం బిడ్డలు బ్రిటీషర్ల చేతిలో ఎక్కువగా మోసపోయే వారు.

విశ్వనాథ్‌ పట్నాయక్‌ మద్దతు
వ్యవసాయమే ఆధారంగా బతికే మన్యం బిడ్డలపై జరుగుతున్న ఆగడాలను చూసిన కుజింద్రికి చెందిన బైరు గమాంగ్‌ ప్రజలందరినీ ఏకతాటిపై నిలబెట్టి శాంతియుత పోరాట స్ఫూర్తిని రగిలించారు. గుణుపురం చుట్టు పక్కల గ్రామాలతోపాటు రాయగడ వరకు వెళ్లి ప్రజలను కూడగట్టారు. తెల్లదొరలపై పోరాటం చేసేందుకు శాంతియుత మార్గంలో బైరు వెళ్తున్నాడని తెలుసుకున్న గంజాం జిల్లాకు చెందిన గాంధేయవాది విశ్వనాథ్‌ పట్నాయక్‌ 1938లో కుజింద్రి గ్రామానికి వచ్చారు. బైరు నిర్ణయానికి మద్దతు పలికారు. ఆయన ఇంట్లోనే ఉంటూ పోరాటానికి ఇద్దరూ కలసి ప్రణాళికలు రచించారు. గిరిజన చిన్నారులకు చదువు చెప్పాలని సంకల్పించి ఒక చిన్న భవనాన్ని ఏర్పాటు చేసి, అందులో పాఠశాల ప్రారంభించారు.

కొండల్లో తలదాచుకునేవారు
ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు తెలపాలన్న గాంధీజీ పిలుపునకు గుణుపురం, కుజింద్రి ప్రాంతాల్లో ర్యాలీలు, రహస్య సమావేశాలు జరిగేవి. అందుకోసం విశ్వనాథ్‌ పట్నాయక్‌ ప్రజలను రెండు వర్గాలుగా విభజించారు. ఒక వర్గం సత్యాగ్రహానికి మద్దతుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, మరో వర్గం పిల్లలకు చదువు చెప్పడం, వస్త్రాలు తయారు చేస్తుండేవారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటీషు సైనికులు సమావేశాలకు అడ్డుకట్టవేయాలని గ్రామాలకు వచ్చినప్పుడు పురుషులంతా కొండ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకునేవారు.
నూలు వస్త్రాల వైపు మొగ్గు
పోరాటంలో భాగంగా అందరూ నూలు వస్త్రాలనే ధరించాలని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని బైరు గమాంగ్‌ అనుకున్నారు. గుణుపురం ప్రాంతంలో పత్తి ఎక్కువగా పండుతుండడంతో ఆ ఉత్పత్తిని మరింత పెంచాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. నూలు వస్త్రాలు వడికేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారంతా తయారు చేసిన వస్త్రాలను ఇతర గ్రామాలకు సరఫరా చేయడంతో ప్రజలు ఆ వస్త్రాలనే ధరించడం మొదలు పెట్టారు.
ఎవరైనా ఇస్తేనే తిండి
ప్రజల్లో చైతన్యం కోసం భైరు గమాంగ్‌ ఉదయం నుంచి రాత్రి వరకు జెండా పట్టుకుని గ్రామాల్లో తిరుగుతుండేవారు. ఆ సమయంలో ప్రజలు ఏదైనా ఇస్తే తిని ఆకలి తీర్చుకునేవారు లేదంటే పస్తులుండే వారు.
తండ్రి వెంట నడిచిన తనయ
స్వాతంత్య్రం కోసం జరుగుతున్న శాంతియుత పోరాటంలో బైరు గమాంగ్‌తోపాటు భైరు సబర అనే వ్యక్తి సైతం పాల్గొనే వాడు, ఆయన కుమార్తె శాండీ సబర కూడా తండ్రి వెంట నడిచింది. మహిళలు ఆమె మార్గదర్శకత్వంలోనే నడిచేవారు. ఒక సారి కొన్ని గ్రామాల్లో జాతీయ జెండాను ఎగుర వేసిన మహిళలు ఆంగ్లేయులు దేశం వదిలి వెళ్లిపోవాలని నినదించారు. వీరిని ప్రోత్సహించింది శాండీ సబర అని తెలుసుకున్న బ్రిటీషు సైనికులు కుజింద్రి గ్రామానికి వెళ్లారు. ముందే ఊహించిన వందలాది మంది మహిళలు మువ్వన్నెల జెండాలు పట్టుకుని సైనికులకు ఎదురు నిలబడ్డారు. ఏమీ చేయలేక సైనికులు వెనుతిరిగారు. ఇది మహిళల్లో పోరాట స్ఫూర్తిని రగిలించింది. ఆనాటి నుంచి మరింత ఉత్సాహంగా స్వాతంత్య్ర సంగ్రామంలో భాగమయ్యారు. ఈ సంఘటన తెల్లదొరలకు ఆగ్రహం తెప్పించింది. కుజింద్రి గ్రామానికి చెందిన 15 మంది పురుషులు, 20 మంది మహిళలతోపాటు విశ్వనాథ్‌ పట్నాయక్‌ను అదను చూసి అరెస్టు చేశారు. అందరినీ గుణుపురం జైలులో ఉంచగా విశ్వనాథ్‌ పట్నాయక్‌ను కొరాపుట్‌ జైలుకు తరలించారు.
పోరాటానికి గుర్తుగా స్థూపం
స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాటుపడిన విశ్వనాథ్‌ పట్నాయక్‌, బైరు గమాంగ్‌, నీలకంఠ గమాంగ్‌, రామచంద్ర గమాంగ్‌తోపాటు భైరు సబర, మరి కొంతమంది సమరయోధుల గుర్తుగా కుజింద్రిలో స్థూపం నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు