logo

వ్యవసాయోత్పత్తుల్లో అగ్రగామి కావాలి

అన్నదాతల ప్రయోజనమే ధ్యేయంగా సాగుతున్నామని, వ్యవసాయోత్పత్తుల్లో రాష్ట్రం అగ్రగామి కావాలన్న లక్ష్యంతో ఉన్నామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. శుక్రవారం మయూర్‌భంజ్‌ జిల్లా రాసగోవిందపూర్‌ వద్ద సువర్ణరేఖ నదిపై నిర్మాణమైన రెండు మధ్యతరహా నీటిపారుదల

Published : 13 Aug 2022 02:30 IST

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

వేదికపై నవీన్‌, పాండ్యన్‌, ఎమ్మెల్యే మరాండి, భారతి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అన్నదాతల ప్రయోజనమే ధ్యేయంగా సాగుతున్నామని, వ్యవసాయోత్పత్తుల్లో రాష్ట్రం అగ్రగామి కావాలన్న లక్ష్యంతో ఉన్నామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. శుక్రవారం మయూర్‌భంజ్‌ జిల్లా రాసగోవిందపూర్‌ వద్ద సువర్ణరేఖ నదిపై నిర్మాణమైన రెండు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం ఉత్పత్తిలో ముందంజలో ఉన్న ఒడిశా వరేతర పంటల సాగులోనూ పురోభివృద్ధి సాధించాలని, ఆ దిశగా సత్ఫలితాలు సాధించేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. 40 శాతానికి మించి పంటపొలాలకు నీటి సౌకర్యం అందించామని, సువర్ణరేఖ ప్రాజెక్టుల ద్వారా మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌, కేంఝర్‌ జిల్లాల రైతులకు ప్రయోజనం సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో పర్యటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖల మంత్రి అశ్వినీ పాత్ర్‌, ఎమ్మెల్యేలు సుధాం మరాండి, రాజకిశోర్‌ దాస్‌, జడ్పీ అధ్యక్షురాలు భారతి హన్సదా ఇతర అధికారులు పాల్గొన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో
మయూర్‌భంజ్‌ జిల్లా సువర్ణరేఖ నదిపై రెండు నీటిపారుదల ప్రాజెక్టులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. రాస గోవిందపూర్‌ వద్ద రూ.685 కోట్ల వ్యయంతో నిర్మాణమైన ప్రాజెక్టు ద్వారా మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌ జిల్లాల్లో 17,121 హెక్టార్లకు సాగునీరందుతుంది. 55 వేల మంది రైతులు ప్రయోజనం పొందుతారు. మయూర్‌భంజ్‌ జిల్లా కరంజియా సమితిలోని హత్తిబారి వద్ద రూ.823 కోట్లతో దేవ్‌ నదిపై నిర్మాణమైన ప్రాజెక్టుతో 9,900 హెక్టార్ల పంట పొలాలు సస్యశ్యామలమవుతాయి. మయూర్‌భంజ్‌, కేంఝర్‌ జిల్లాలకు చెందిన 100 గ్రామాల్లోని 2 లక్షల రైతులకు ప్రయోజనాలు కలుగుతాయి. భారీగా ప్రజలు తరలివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని