logo

రత్న భాండాగారం తెరవాలి

పూరీ జగన్నాథుని రత్నభాండాగారం లోపల పరిస్థితి అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉన్నందున భాండాగారం తలుపులు తెరవాలని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) సూపరింటెండెంటు అరుణ్‌ మల్లిక్‌ శ్రీక్షేత్ర పాలనాధికారికి,

Published : 13 Aug 2022 02:30 IST

లోపల మరమ్మతులు తప్పనిసరి
యంత్రాంగానికి ఏఎస్‌ఐ లేఖ

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ జగన్నాథుని రత్నభాండాగారం లోపల పరిస్థితి అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉన్నందున భాండాగారం తలుపులు తెరవాలని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) సూపరింటెండెంటు అరుణ్‌ మల్లిక్‌ శ్రీక్షేత్ర పాలనాధికారికి, న్యాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి లేఖలు రాశారు. ఏఎస్‌ఐ దీనిపై లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు శ్రీక్షేత్ర అభివృద్ధి అధికారి అజయ్‌ జెనా గురువారం రాత్రి విలేకరులకు చెప్పారు.
లేఖలో ఏం పేర్కొన్నారు?
చాలాకాలంగా రత్నభాండాగారం తెరవనందున లోపల పరిస్థితి ఎలా ఉందన్నదానిపై స్పష్టత లేదు. 2018 ఏప్రిల్‌ 4న భాండాగారం పరిశీలనకు వెళ్లిన నిపుణుల బృందం రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది. అప్పట్లో కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన సమయంలో పైకప్పు ప్లాస్టర్‌ పెచ్చులు ఊడిన విషయాన్ని గమనించారు. గోడల్లో తేమ కనిపించింది. ఈ నేపథ్యంలో సమగ్ర అధ్యయనం చేపట్టి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున తలుపులు తెరవడానికి అనుమతించాలని ఏఎస్‌ఐ అధికారి యంత్రాంగానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
లేజర్‌ స్కానింగ్‌ చేయాలి
ప్రముఖ జగన్నాథ తత్వవేత్త డాక్టర్‌ ప్రఫుల్ల రథ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రత్నభాండాగరం లోపల లేజర్‌ స్కానింగ్‌ చేయాలని తర్వాత మరమ్మతులు చేపడితే బాగుంటుందని సూచించారు.
ఆభరణాలు భద్రంగా ఉన్నాయా?
రత్నభాండాగారంలో పురుషోత్తముని దివ్యాభరణాలు భద్రంగా ఉన్నాయా? అన్నదానిపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లెక్కించాలని సేవాయత్‌లు, ఇతర సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పురాతన నివేదికలో ఉన్న వివరాల మేరకు ఆభరణాలన్నీ ఉన్నాయా? అన్నది స్పష్టం చేయాలని అంతా కోరుతున్నారు. రహస్య మందిరం తలుపులు తెరిస్తే కచ్చితంగా లెక్కింపు జరుగుతుంది. ఏఎస్‌ఐ మరమ్మతులు చేసే అవకాశం కలుగుతోంది.
త్వరలో సమావేశం నిర్వహించాలి
భాండాగారం తెరవాలంటే శ్రీక్షేత్ర పాలకవర్గం సమావేశమై తీర్మానం చేయాలి, న్యాయశాఖ అనుమతించాలి. ఈ రెండు జరిగిన తర్వాతే తలుపులు తెరుస్తారు. ఏఎస్‌ఐ అధికారులతోపాటు ఆభరణాల లెక్కింపునకు బృందం ఏర్పాటు చేయాలి. తేదీ నిర్ణయమైన తర్వాత తలుపులు తెరుస్తారని శ్రీక్షేత్ర ప్రధాన సేవాయత్‌ రజిత్‌ ప్రతిహారి శుక్రవారం విలేకరులకు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని