logo

రాష్ట్రానికి వరద ముప్పు?

రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న అంచనాతో యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని జలవనరుల శాఖ కార్యాలయంలో 247 కంట్రోల్‌ రూం శనివారం ప్రారంభించారు. ఆ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనుగార్గ్‌, చీఫ్‌

Published : 14 Aug 2022 04:53 IST

సిబ్బంది సెలవులు రద్దు: కంట్రోల్‌ రూం ఏర్పాటు

మహానదిపై జలవనరులశాఖ నిఘా

34 గేట్ల ద్వారా హిరాకుడ్‌ నీరు విడుదల

విడుదలవుతున్న హిరాకుడ్‌ నీరు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న అంచనాతో యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని జలవనరుల శాఖ కార్యాలయంలో 247 కంట్రోల్‌ రూం శనివారం ప్రారంభించారు. ఆ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనుగార్గ్‌, చీఫ్‌ ఇంజినీరు బిజయ్‌ కుమార్‌ మిశ్ర, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అత్యవసర శాఖల సిబ్బంది సెలవులను రద్దు చేశారు.

భారీ వర్షాలతో అతలాకుతలం

బంగాశాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో అతిభారీగా ఉన్నందున నదుల్లో ప్రవాహాలు పెరిగాయి. అఖువాపద వద్ద (కేంఝర్‌ జిల్లా) వైతరణి శనివారం మధ్యాహ్నం ప్రమాద స్థాయి దాటింది. ఇక్కడ నది ప్రమాదస్థాయి 17.83 మీటర్లు కాగా 18.23 మీటర్లకు పెరిగినట్లు జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీరు మిశ్ర విలేకరులకు చెప్పారు. బాలేశ్వర్‌ జిల్లా మధాని వద్ద జలకా ప్రమాదస్థాయి 5.5 మీటర్లు అని, మధ్యాహ్నం ప్రవాహం 5.98కి పెరిగినట్లు తెలిపారు. సువర్ణరేఖ, బ్రహ్మణి, బుఢాబొలంగ, రుషికుల్యా, వంశధార, నాగావళి, తేల్‌, ఉదంతి, కఠజోడి, దయ, భార్గవి, కుశభద్ర, మహానదిలో ప్రవాహాలు పెరిగినా ప్రమాదస్థాయి దిగువ ప్రవహిస్తున్నాయని చెప్పారు. హిరాకుడ్‌ వరదనీరు 34 గేట్ల ద్వారా విడుదలవుతోంది. ఈ ప్రవాహం మహానదికి చేరుతోందని, సోమవారం ఉదయంలోగా కటక్‌లోని ముండలి వద్ద నది ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులుగా ఉంటుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో మహానదికి స్వల్పంగా వరద ముప్పు ఉండొచ్చన్న అంచనాతో పరివాహక ప్రాంతాలకు అధికారులను తరలించినట్లు జలవనరులశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనుగార్గ్‌ తెలిపారు.

పశ్చిమ ఒడిశాలో భయాందోళన

పశ్చిమ ఒడిశాలోని సంబల్‌పూర్‌, సోన్‌పూర్‌, బౌద్ధ్‌ జిల్లాలు మహానది వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శనివారం 2 గంటలకు సంబల్‌పూర్‌ (బుర్లా) హిరాకుడ్‌ జలాశయంలోకి ఇన్‌ఫ్లో 4.85 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు డ్యాం చీఫ్‌ ఇంజినీరు ఆనందచంద్ర సాహు విలేకరులకు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 28 స్విస్‌ గేట్ల ద్వారా సెకనుకు 3,48,760 క్యూసెక్కుల నీరు మహానదికి విడుదల చేస్తున్నామన్నారు. జలాశయం సామర్థ్యం 630 అడుగులు కాగా నీటిమట్టం 617.05 అడుగులుగా ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అక్కడి కల్మా జలాశయం ద్వారా విడుదల చేస్తున్న వరద నీరు హిరాకుడ్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నదికి నీరు విడుదల చేయడంతో సంబల్‌పూర్‌ లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఆ జిల్లా కలెక్టరు అనన్యదాస్‌ మధ్యాహ్నం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లోతట్టు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. మైకుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.

కోస్తా, పశ్చిమ ప్రాంతాలకు ముప్పు?

ఉత్తర కోస్తా, పశ్చిమ ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అప్రమత్తం చేసినందున సత్వర చర్యలు తీసుకోవాలని విపత్తుల నివారణ శాఖ కలెక్టర్లకు ఆదేశించింది. ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ జెనా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. మహానదికి వరదలొస్తే ఉపనదులూ పొంగిపొర్లుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసర చర్యలు తీసుకున్నామని జెనా విలేకరులకు చెప్పారు.

పరవళ్లు తొక్కుతున్న వైతరణి నది​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని