logo

జల దిగ్బంధం

మహానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సంబల్‌పూర్‌ జిల్లా లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రహదారులు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 1500 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పశ్చిమ ఒడిశాలోని సోన్‌పూర్‌, బౌద్ధ్‌, బరగఢ్‌, దేవ్‌గఢ్‌ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.

Updated : 15 Aug 2022 06:13 IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

నదులకు పోటెత్తిన వరద

చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు

పశ్చిమ ప్రాంతాలు ప్రభావితం

మహానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సంబల్‌పూర్‌ జిల్లా లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రహదారులు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 1500 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పశ్చిమ ఒడిశాలోని సోన్‌పూర్‌, బౌద్ధ్‌, బరగఢ్‌, దేవ్‌గఢ్‌ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. కుండపోత వర్షాలు ఇలాగే కొనసాగితే.. హిరాకుడ్‌ గేట్లు తెరిచినా.. బొలంగీర్‌, కలహండి, నుపవాపడ జిల్లాలపై ప్రభావం పడుతుంది.

ఆనందపూర్‌ వద్ద వైతరణి నది పరవళ్లు. పరిస్థితి తిలకిస్తున్న జలవనరులశాఖ ఇంజినీర్లు

ముండలి వద్ద పెరుగుతున్న ప్రవాహం

కటక్‌ జిల్లా ముండలి బ్యారేజీ వద్ద శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు 5.68 క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తోంది. సోమవారం ఉదయానికి 8 లక్షల క్యూసెక్కులుగా ఉండొచ్చని జలవనరుల నిపుణులు అంచనా వేస్తున్నారు. కటక్‌ జిల్లాలోని ముండలి, రాజ్‌ఘాట్‌, బర్మూల్‌, ఖరాయిమాల్‌ బ్యారేజీల్లో నీటి మట్టం పెరిగి, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, కేంద్రపడ, పూరీ, ఖుర్ధా జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయి.

యంత్రాంగం అప్రమత్తం

ఒడిశా స్టేట్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ అథారిటీ(ఓఎస్‌డీఎంఏ), అగ్నిమాపక, ఓడ్రాఫ్‌, జల వనరుల శాఖలను.. అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో జలవనరుల సిబ్బంది పరిస్థితి సమీక్షిస్తున్నారు. గట్లకు గండి పడితే తక్షణ మరమ్మతులు చేసేందుకు ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఓడ్రాఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమయ్యారు. ఆహారం, మంచినీరు, ఔషధాలు తదితరాలు సిద్ధం చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు.

హిరాకుడ్‌ నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న నీరు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు, జలాశయాలకు వరద పోటెత్తింది. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మహానదిలో అంతకంతకూ నీటి స్థాయి పెరుగుతుండడంతో వరద ముప్పు వెంటాడుతోంది.

ప్రమాద స్థాయికి చేరువలో

కేంఝర్‌ జిల్లాలోని ఆనందపూర్‌ వద్ద వైతరణి నది నీటి మట్టం ప్రమాదస్థాయి దాటి 18.28 మీటర్ల మేర ప్రవహిస్తోంది. బాలేశ్వర్‌ జిల్లాలోని మధాని వద్ద జలకా నది సైతం 5.96 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. సువర్ణరేఖ, బుడాబొలంగ, దేవి, కుశభద్ర, తేల్‌, ఉదంతి, వంశధార, నాగావళి, రుషికుల్య, హరభంగీ, బొడొనదుల్లో వరద పోటెత్తినట్లు జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీరు బిజయ్‌ కుమార్‌ మిశ్ర విలేకరులకు వెల్లడించారు.

మహానది ఉగ్రరూపం

ఛత్తీస్‌గఢ్‌ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండడంతో కల్మా ఇతర జలాశయాల నుంచి సంబల్‌పూర్‌ హిరాకుడ్‌ జలాశయానికి వరద నీరు ప్రవేశిస్తోంది. ఈ జలాశయం సామర్థ్యం 630 అడుగులు కాగా, మధ్యాహ్నం 12.30 గంటలకు నీటి మట్టం 616.60 అడుగులకు చేరుకుంది. సెకనుకి 5,79,680 క్యూసెక్కుల నీరు ప్రవేశిస్తుండడంతో 34 స్విస్‌ గేట్ల ద్వారా సెకనకు 5,61,054 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు డ్యాం చీఫ్‌ ఇంజినీరు ఆనంద చంద్రసాహు విలేకరులకు చెప్పారు. అవసరమైతే మరిన్ని గేట్లు తెరుస్తామన్నారు. హిరాకుడ్‌ నుంచి నీరు విడుదల అవుతుండడంతో మహానది ఉగ్రరూపం దాల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని