logo
Published : 19 Aug 2022 03:25 IST

గ్రామస్థులు పొమ్మన్నారు... అధికారులు ఆదుకున్నారు

బాధితురాలు చంచల సాహు

కటక్‌, న్యూస్‌టుడే: దేశం కరోనా వంటి మహమ్మారిపై యుద్ధం చేసి జయించింది. మరోవైపు కొందరి అనవసర భయాలు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే సోన్‌పూర్‌ జిల్లా ఊలుండా సమితి మహిద గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన. వ్యాధి అనుమానంతో మూడేళ్లుగా ఒక వృద్ధురాలిని గ్రామానికి దూరంగా ఒంటరిగా వదిలేసిన అమానవీయ ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటన పూర్వపరాల్లోకి వెళితే... గ్రామంలో చంచల సాహు (60) అనే వితంతువు కుమారుడు బిబూతి సాహు (27)తో కలసి ఉంటోంది. కొన్నేళ్ల క్రితం ఆమె కాలుకు గాయమైంది. అది తగ్గకపోవడంతో కొంతమంది గ్రామస్థులు కుష్ఠువ్యాధి సోకినట్లు అనుమానించారు. వ్యాధిగ్రస్థురాలు గ్రామంలో ఉండడానికి వీల్లేదని పేర్కొంటూ వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని చెప్పారు. చంచల బంధువులు కూడా అదే మాట అన్నారు. దీంతో తనతోపాటు తన కుమారుడ్ని కూడా వెలివేస్తారనే భయంతో ఆయనను గ్రామంలోనే వదిలి ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న మహానది గట్టుపై పాలీథిన్‌తో గుడారం వేసుకొని మూడేళ్లుగా ఉంటోంది. రాత్రి సమయంలో చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపేది. కొడుకు ఆమెకు భోజనం తెచ్చి పెట్టి వెళ్లిపోయేవాడు. ఇటీవల వర్షాలతో నదికి వరదలు రావడంతో నీటి మట్టం పెరిగింది. చంచల ఉంటున్న గుడారంలోకి పాములు, విష కీటకాలు ప్రవేశించాయి. దీంతో రాత్రంతా భయంతో నిద్రలేకుండా గడిపేది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన స్థానిక జిల్లా అధికారులు ఆమెను చూసి ఆదుకునేందుకు ముందుకొచ్చారు. బుధవారం రాత్రి అంబులెన్స్‌ రప్పించి ఆమెను జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఆమెకి కుష్ఠువ్యాధి లేదని వైద్యులు తెలిపారు. అధికారులు గురువారం గ్రామానికి వెళ్లి చంచల సాహుకి వ్యాధి లేదని, గాయం త్వరలో తగ్గుతుందని చెప్పారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని