logo

Diabetes: పచ్చి పనసకాయ పొడితో మధుమేహం నియంత్రణ

పచ్చి పనసకాయతో తయారు చేసిన పొడి రోజూ కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని అధ్యయనంలో తేలింది.

Updated : 25 Sep 2022 12:09 IST

రోగుల్లో గ్లూకోజు స్థాయిలు తగ్గుతున్నట్లు గుర్తింపు


జాక్‌ఫ్రూట్‌ 365ను విడుదల చేస్తున్న డాక్టర్‌ లత శషి,  జేమ్స్‌ జోసఫ్‌, మహారాణా

ఈనాడు, హైదరాబాద్‌: పచ్చి పనసకాయతో తయారు చేసిన పొడి రోజూ కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని అధ్యయనంలో తేలింది. రోజూ వాడుతున్న మందులతోపాటు ఈ పొడి డయాబెటిక్‌ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తున్నట్లు అధ్యయంలో గుర్తించామని జాక్‌ఫ్రూట్‌365.కమ్‌ వ్యవస్థాపకుడు జేమ్స్‌ జోసెఫ్‌ తెలిపారు. ఈ వివరాలను శుక్రవారం ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్‌ లతా శశి, ఎండోక్రినాలజిస్టు డాక్టర్‌ వినోద్‌ అభిచందానీతో కలిసి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రిసెర్చ్‌, ఎథిక్స్‌ కమిటీ నుంచి అనుమతి తీసుకున్నామని వివరించారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది టైప్‌-2 మధుమేహ బాధితులపై 12 వారాలపాటు ఈ అధ్యయనం చేశామన్నారు.

అధ్యయనంలో భాగంగా వీరిని రెండు గ్రూపులుగా విడదీసి ఒకరికి పచ్చి పనస కాయతో చేసిన పొడి (రోజుకు 30 గ్రాములు), మిగతా వారికి బియ్యం లేదా గోధుమపిండి (ప్లాసిబో ఫ్లోర్‌) అంతే మొత్తంలో అందించామన్నారు. తర్వాత వారిని పరీక్షించగా ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడైనట్లు తెలిపారు. పనసకాయ పొడి తీసుకున్న వారిలో గ్లైకోసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌ (హెచ్‌బీఏ1సీ), ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ (ఎఫ్‌బీజీ), పోస్ట్‌ ప్రాండియల్‌ గ్లూకోజ్‌ (పీపీజీ)లో గణనీయ మార్పు కన్పించందన్నారు.

ఈ స్థాయిలన్ని మునుపటికంటే తగ్గినట్లు గుర్తించామన్నారు. అదే ప్లాసిబో ఫ్లోర్‌ వినియోగించిన వారిలో ఎలాంటి తేడా లేదన్నారు. మధుమేహానికి సాధారణ మందులు వాడుతూనే అదనంగా ఈ పొడి తీసుకోవడం ఎంతో మేలు చేస్తుందని జేమ్స్‌ జోసెఫ్‌ వివరించారు. ఈ పొడి ఇప్పుడు మార్కెట్‌లో వివిధ పేర్లతో అందుబాటులో ఉందన్నారు. ఈ పొడితోపాటు మధుమేహానికి ఇచ్చే మందులు యథావిధిగా వాడాల్సి ఉంటుందని, కొందరిలో మాత్రం రోజుకు 2 మాత్రలకు బదులు ఒకటితో సరిపెట్టవచ్చునని డయాబెటాలజిస్ట్‌, ఎండోక్రినాలజిస్టు డాక్టర్‌ వినోద్‌ అభిచందానీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని