logo

చిన్నారుల కోసం.. నవ్వుల లోకం..!

ప్రస్తుత రోజుల్లో పిల్లలు చరవాణులకు అతుక్కుపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పాఠశాలల్లోనూ ఆహ్లాదం, వినోదం అంతంతమాత్రంగానే అందుతున్నాయి. వీటి దృష్ట్యా చిన్నారుల్లో మానసికంగా, శారీరకంగా అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయి.

Published : 25 Sep 2022 03:10 IST

న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం


లాఫింగ్‌ థెరపీలో శిక్షణ పొందుతున్న పిల్లలు

ప్రస్తుత రోజుల్లో పిల్లలు చరవాణులకు అతుక్కుపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పాఠశాలల్లోనూ ఆహ్లాదం, వినోదం అంతంతమాత్రంగానే అందుతున్నాయి. వీటి దృష్ట్యా చిన్నారుల్లో మానసికంగా, శారీరకంగా అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమ వంతు బాధ్యతగా పిల్లల కోసం ఏమైనా చేయాలనే సంకల్పంతో జిల్లా కేంద్రంలో చిల్డ్రన్స్‌ లాఫింగ్‌ క్లబ్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రతినెలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నారుల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నారు.

శ్రీకాకుళం నగరంలో విశ్రాంత చిత్రలేఖనోపాధ్యాయుడు, జాతీయస్థాయి మిమిక్రీ కళాకారుడు లోకనాథం నందికేశ్వరరావు, ఆయన శిష్యుడు మిమిక్రీ శ్రీనివాస్‌, అయ్యప్ప శ్రీనివాస్‌, గాయత్రీకుమార్‌, తదితరులు 2003లో క్లబ్‌ను ప్రారంభించారు. స్థానిక గుడివీధి దరి నాగావళి నదీ తీరంలో రివర్‌వ్యూ పార్కులోక్లబ్‌ కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుట్లో నెలలో తొలి, మూడో ఆదివారాల్లో సాయంత్రం పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. హాస్యవల్లరి, పాటలు, కవితలు, పొడుపు కథలు, సామెతలు, వివిధ రకాల ఆటలు, నీతి శతకాల పద్యాల పోటీలు నిర్వహించేవారు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేవారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు క్లబ్‌ తరఫున కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మళ్లీ కలెక్టర్‌ బంగ్లా దరి ఆలయాల సమూహ ప్రాంగణంలో ప్రతి ఆదివారం పిల్లలకు నటన, నృత్యం, చిత్రలేఖనం, పేపర్‌ కటింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. సుమారు 200 మంది వస్తున్నట్లు క్లబ్‌ నిర్వాహకులు తెలిపారు.

వినోదం అందించాలనే...
పిల్లలకు వినోదం అందించాలనే ఉద్దేశంతోనే లాఫింగ్‌ క్లబ్‌ ఏర్పాటు చేశాం. ఏటా వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాతల ఆర్థిక సాయంతో నడుపుతున్నాం. వినియోగించుకోవాలని కోరుతున్నాం. నవంబరులో చిల్డ్రన్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

- ఎల్‌.నందికేశ్వరరావు, చిల్డ్రన్స్‌ లాఫింగ్‌ క్లబ్‌ నిర్వాహకుడు

సరదాగా ఉంటున్నాయి..
నేను ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఆదివారం పూట ఆటవిడుపుగా ఏర్పాటు చేస్తున్న వినోద కార్యక్రమాలు సరదాగా ఉంటున్నాయి. లాఫింగ్‌క్లబ్‌కి నేను తరచూ వస్తుంటాను. చదువుతో పాటు ఆటపాటలు నేర్చుకోమని అమ్మ ప్రోత్సహస్తూ ఉంటుంది. ఇక్కడ చిత్రలేఖనం, సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను.

- ఎల్‌.నందిని, శ్రీకాకుళం

కొత్త స్నేహితులు కలిశారు...
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. పాఠశాలలో పాఠాలు మాత్రమే చెబుతారు. ఇక్కడ మనకిష్టమైనవి నేర్చుకోవచ్చు. నేను జానపద నృత్యం, చిత్రలేఖనం నేర్చుకుంటున్నాను. వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీలు నిర్వహించి బహుమతులు కూడా ఇస్తున్నారు. కొత్త స్నేహితులు కలిశారు.

- మాధురి, పాతశ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని