logo

మహేంద్రగిరి సోయగం.. రమణీయ దృశ్యాల సమాహారం

గజపతి జిల్లాలోని ముఖ్య పర్యాటక కేంద్రం మహేంద్రగిరి. సముద్రమట్టానికి 15 వందల మీటర్ల ఎత్తులో ఉన్న మహేంద్రగిరికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శివరాత్రికి భక్తులు, యాత్రికులు వేల సంఖ్యలో వస్తారు.

Published : 27 Sep 2022 03:22 IST

పర్వతంపై నీలి మేఘాల అందాలు

పర్లాఖెముండి, కాశీనగర్‌, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలోని ముఖ్య పర్యాటక కేంద్రం మహేంద్రగిరి. సముద్రమట్టానికి 15 వందల మీటర్ల ఎత్తులో ఉన్న మహేంద్రగిరికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శివరాత్రికి భక్తులు, యాత్రికులు వేల సంఖ్యలో వస్తారు. క్షత్రియులను ఓడించిన అనంతరం పరశురాముడు ఇక్కడి పర్వత శిఖరాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడని, ఆ సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి పరుశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో కుంతి మందిరం, ధర్మరాజు, అర్జుని గుహ, భీముని మందిరం నిర్మించుకున్నారు.

 భీముని గుడి దర్శనం ప్రత్యేకం

ప్రకృతి అందాలు, పక్షులు కిలకిలారావాలు, ఉదయించే సూర్యుడిని చూస్తుంటే అందిన దూరంలో భానుడు ఉన్నాడా అన్న అనుభూతి కలగక మానదు. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గుడి ముఖ ద్వారం గుండా లోపలకు ప్రవేశించే యాత్రికులు ఒక చిన్న సందులోంచి బయటకు వచ్చేలా నిర్మించిన తీరు ఆశ్చర్య పోయేలా చేస్తుంది. ఇలా చేయడం వలన సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

భీముని మందిరం

బస చేసేందుకు ఏర్పాట్లు శూన్యం
మహేంద్రగిరి ప్రత్యేకతల సమాహారం, ఔషధీయ మొక్కలకు నిలయం. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ గిరిని సందర్శించే యాత్రికులు, భక్తులకు వసతి సౌకర్యాలు శూన్యం. శివరాత్రికి కొండపైకి వచ్చే భక్తులు గుడారాలు వేసుకొని బస చేయాల్సిందే. ఆహారం సైతం వెంట తెచ్చుకోవాలి. నీటి సౌకర్యం అంతంత మాత్రమే. విద్యుత్తు సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే మహేంద్ర గిరికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

కొండపై వరకు చక్కని రోడ్లు..

మహేంద్రగిరి కొండ దిగువ నుంచి పైవరకు 6 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మించడంతో భక్తులు, యాత్రికులు సులభంగా చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని