logo

తమవారే డీలర్లు... ఫిర్యాదులు బుట్టదాఖలు

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లో అవినీతికి ఆస్కారం లేదని, పారదర్శకతకు పెద్దపీట వేశామని పదేపదే చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు రేషన్‌ డీలర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు

Published : 27 Sep 2022 03:24 IST

ప్రభుత్వ పెద్దల తీరుపై ఆరోపణలు
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే


పీడీఎస్‌ రేషన్‌ దుకాణం

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లో అవినీతికి ఆస్కారం లేదని, పారదర్శకతకు పెద్దపీట వేశామని పదేపదే చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు రేషన్‌ డీలర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై విపక్షాలు నిలదీస్తున్నా పాలకులు సమర్థించుకుంటున్నారు.

7068 మందిపై ఆరోపణలు

ఆహారహామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు (బీపీఎల్‌) రూపాయికే కిలో బియ్యంతోపాటు గోధుమలు అందిస్తున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల కిరోసిన్‌ కూడా ఇస్తోంది. రాష్ట్రంలో 7068 మంది ప్రైవేటు రేషన్‌ డీలర్లున్నారు. ఇటీవల పౌరసరఫరాలశాఖ మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) సహకార సమితులకు 6,562 రేషన్‌ దుకాణాల లైసెన్సులు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు డీలర్లు సక్రమంగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం లేదని, తూకంలో తేడాలు ఉన్నాయని పలుచోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవు. ఏడేళ్లుగా వారినే కొనసాగిస్తూ లైసెన్సులు పునరుద్ధరిస్తున్నారు.

బిజద కార్యకర్తలకు పెద్దపీట

ప్రైవేటు డీలర్లంతా బిజద కార్యకర్తలే. అధికార పార్టీ అండదండలు ఉన్నందున అవినీతి ఆరోపణలున్నా అధికారులు దర్యాప్తు చేసి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల నిబంధనల ప్రకారం రేషన్‌ దుకాణాలు, డీలర్ల లైసెన్సులు తరచూ ఒకరికే ఇవ్వకూడదు. ఆరోపణలొస్తే దర్యాప్తు చేసి అవి నిజమని తేలితే చర్యలు తీసుకోవాలి. ఈ నిబంధనను పౌరసరఫరాల శాఖ పూర్తిగా విస్మరించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి, బిజద కార్యకర్తలకు డీలర్లుగా నియమించి ఏడేళ్లుగా వారి లైసెన్సులు పునరుద్ధరిస్తోంది. లబ్ధిదారుల పట్ల డీలర్లు దురుసుగా వ్యవహరిస్తూ, తూకాల్లో మోసం చేస్తున్నా అడిగేవారే కరవయ్యారు. చాలాచోట్ల అడ్డగోలుగా బియ్యం, గోధుమలు నల్లబజారుకు తరలిస్తున్నారని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై శాసనసభలో చర్చ జరిగినా పాలకులు పట్టించుకోలేదు.


చందాలిస్తున్నారు

విపక్ష (భాజపా) నేత జయనారాయణ మిశ్ర సోమవారం సంబల్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు రేషన్‌ డీలర్లంతా బిజద కార్యకర్తలని, వారు పార్టీకి చందాలిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు వినిపిస్తున్నా పాలకులు విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ మళ్లీ వారికే లైసెన్స్‌లు ఇస్తున్నారన్నారు.


25 లక్షల కుటుంబాలకు అదనంగా

దీనిపై బిజద అధికార ప్రతినిధి శశిభూషణ్‌ బెహర సోమవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ పేదలు ఇబ్బందులకు గురి కాకూడదన్న ఆలోచనతో కేంద్ర జాబితాలో లేని 25 లక్షల కుటుంబాలకు అదనంగా బీపీఎల్‌ కార్డులు కేటాయించి ఆహార ధాన్యాలు సమకూరుస్తున్నారన్నారు. దీనికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, విపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై గట్టినిఘా ఉంచిందని తెలిపారు.


సభలో నిలదీశాం

కాంగ్రెస్‌ సభాపక్షం నేత నర్సింగమిశ్ర సోమవారం బొలంగీర్‌లో విలేకరులతో మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో అవినీతి, డీలర్లపై పాలకులు అభిమానం చూపించడాన్ని నిలదీసినా పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. లబ్ధిదారుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అవినీతి డీలర్లపై చర్యలు తీసుకోకపోవడం సబబు కాదన్నారు. ప్రజాగ్రహం చవిచూసే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని