logo

పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం ఒడిశా

ఐటీ, రసాయనాలు, చేనేత, జౌళి, విద్యుత్తు, ఆహారోత్పత్తులు, లాజిస్టిక్‌ పార్కులు, ఉక్కు, అల్యూమినియం, మాంగనీసు, క్రోమైట్‌, గ్రానైట్‌ పరిశ్రమల ఏర్పాటుకు ఒడిశా అనుకూలమైనదిగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పెట్టుబడిదారులకు వివరించారు.

Published : 29 Sep 2022 01:54 IST

పెట్టుబడిదారులకు వివరించిన నవీన్‌

గ్లోబల్‌ ఫౌండేషన అధ్యక్షుడు జితేంద్ర చడ్డాకు టీషర్టు బహూకరిస్తూ...

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఐటీ, రసాయనాలు, చేనేత, జౌళి, విద్యుత్తు, ఆహారోత్పత్తులు, లాజిస్టిక్‌ పార్కులు, ఉక్కు, అల్యూమినియం, మాంగనీసు, క్రోమైట్‌, గ్రానైట్‌ పరిశ్రమల ఏర్పాటుకు ఒడిశా అనుకూలమైనదిగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పెట్టుబడిదారులకు వివరించారు. బుధవారం బెంగళూరులోని తాజ్‌ హోటల్లో ఆయన ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధిపతులతో చర్చించారు. ఇక్కడ రాష్ట్ర పరిశ్రమల శాఖ రెండు విడతల్లో పెట్టుబడిదారుల సదస్సులు చేపట్టింది. తొలుత సీఎం ఆయా గ్రూపుల అధిపతులతో నేరుగా మాట్లాడారు. రాత్రి అందరూ ప్రముఖులతో ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విప్రో గ్రూపు సంస్థల సీఈవో శరవణ్‌ సుబ్రహ్మణ్యం, గ్లోబల్‌ ఫౌండేషన్‌ అధిపతి జితేంద్ర చడ్డా, కాన్సెట్రిక్స్‌ దక్ష్‌ సర్వీసెస్‌ అధ్యక్షుడు గిరీష్‌ మీనన్‌, ఐబీఎం సంస్థ మేనేజింగ్‌ పార్టనర్‌ అమిత్‌ శర్మ, పేజ్‌ ఇండస్ట్రీ సీఈవో వీఎస్‌ గణేశ్‌ తదితరులతో చర్చించారు. వారికి ఐటీ-2022 విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు, సౌకర్యాలు ఉన్నాయని, శాంతిభద్రతల సమస్యలు లేవని వివరించారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించే మేకిన్‌ ఒడిశా సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్‌ దేవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, పరిశ్రమశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి హేమంత శర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌, కర్ణాటక వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి కె.ఉల్లాస్‌కామత్‌ తదితరులు పాల్గొన్నారు.

విప్రో గ్రూపు సంస్థల సీఈవో శరవణ్‌ సుబ్రమణ్యంనకు టీషర్టు బహూకరిస్తున్న నవీన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని