logo

నది దాటేందుకు తెప్పని అవస్థలు

నది దాటేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. విద్య, వైద్యం, నిత్యావసరాల మొదలు చివరకు ఆఖరి మజిలీ దహన సంస్కారాల వరకు ఏ పని చేయాలన్నా నది దాటాల్సిందే. అందుకోసం కర్రలు, అరటి దుంగలతో తయారుచేసిన తెప్పలను

Published : 29 Sep 2022 01:54 IST

కర్రల తెప్ప సాయంతో నది దాటుతున్న విద్యార్థులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: నది దాటేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. విద్య, వైద్యం, నిత్యావసరాల మొదలు చివరకు ఆఖరి మజిలీ దహన సంస్కారాల వరకు ఏ పని చేయాలన్నా నది దాటాల్సిందే. అందుకోసం కర్రలు, అరటి దుంగలతో తయారుచేసిన తెప్పలను వినియోగిస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఈ దీన స్థితి జగత్సింగ్‌పూర్‌ జిల్లా బలికూడ సమితి పరిధి రంబిలా, బారిలో గ్రామాలను పట్టి పీడిస్తోంది. గ్రామస్థులు ఏ చిన్నపాటి అవసరానికైనా అలకా నది దాటాల్సిందే. టిటిర పంచాయతీ కేంద్రానికి కేవలం 2 కి.మీ దూరంలో ఉన్న రంబిలా గ్రామానికి చేరుకునేందుకు కనీసం కాంక్రీట్‌ రహదారి లేకపోవడం గమనార్హం. మరోవైపు బారిలో గ్రామస్థులు దహన సంస్కారాలకు సైతం నది దాటాల్సిందే. ఈ నేపథ్యంలో నిత్యం పాఠశాలకు వెళ్లే చిన్నారుల నుంచి పంచాయతీ, సమితి కేంద్రాలకు వివిధ పనులకెళ్లే పెద్దలు, మహిళలు, వృద్ధులు వరకు అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో తెప్పల సాయంతో నది దాటుతున్నారు. అందుకోసం నదికి ఇరువైపులా పోడవాటి తాడు కట్టి దాని సాయంతో ప్రమాదకర పరిస్థితులు నడుమ ప్రయాణం సాగిస్తున్నారు.

నెరవేరని విన్నపాలు

ఇప్పటికే చాలా మందికి తమ దీనావస్థ గురించి మెరపెట్టుకున్నామని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు కానరాలేదని గ్రామస్థులు వాపోతున్నారు. బారిలో గ్రామానికి చెందిన జింగీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ ఇటీవల తన తండ్రి చనిపోతే ఆయన మృతదేహాన్ని తెప్పపై ఉంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లామని ఆవేదన వ్యక్తం చేశారు. టిటిర పంచాయతీ సర్పంచ్‌ ప్రశాంతి మంజరి నాయక్‌ మాట్లాడుతూ స్థానికులు దీనిపై తహసీల్దార్‌ని కలిసి వంతెన నిర్మించాలని మెరపెట్టుకున్నారని చెప్పారు. ఈ విషయం యంత్రాంగం దృష్టికి వెళ్లినా ఇంతవరకు ఎలాంటి చర్యలు కానరాలేదని పేర్కొన్నారు. నదిపై కనీసం ఓ చిన్నపాటి కాలిబాట వంతెనైనా నిర్మించాలని స్థానిక శాసనసభ్యుడు, నీటి వనరులశాఖ మంత్రి రఘునందన్‌ దాస్‌కి ఇదివరకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని బొరికిన పంచాయతీ మాజీ సర్పంచి సాధుచరణ్‌ సాహు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని