logo

మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి

పూరీ జిల్లా జిల్లా పరిషత్తు 11వ నెంబర్‌ జోన్‌ సభ్యుడు ధర్మేంద్ర సాహు అనుమానాస్పద మృతి ఘటనలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భాజపా, కాంగ్రెస్‌లు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు

Published : 29 Sep 2022 01:54 IST

మంత్రి నివాసం ఎదుట కోడిగుడ్లతో ఛాత్ర కాంగ్రెస్‌ కార్యకర్తలు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పూరీ జిల్లా జిల్లా పరిషత్తు 11వ నెంబర్‌ జోన్‌ సభ్యుడు ధర్మేంద్ర సాహు అనుమానాస్పద మృతి ఘటనలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భాజపా, కాంగ్రెస్‌లు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో పూరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు బుధవారం భువనేశ్వర్‌లో మంత్రి నివాసం ఎదుట ఛాత్ర కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌ భవన్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తూ మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించి మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు తీసుకుంది. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు అందించిన వివరాల ప్రకారం... ధర్మేంద్ర సాహు మరణించక ముందు తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అయిదుగురు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, తను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన స్నేహితునికి చెప్పినట్లు ఆ సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి. ఆ అయిదుగురు వ్యక్తుల పేర్లలో మంత్రి సమీర్‌ రంజాన్‌ దాస్‌ పేరు కూడా ఉంది. మంత్రితోపాటు మిగిలిన నలుగురిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఏడు రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని