logo

అవినీతి ‘పథకాలు’... నిధులు గోల్‌మాల్‌

పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరిపించలేకపోయిన ఒడిశా ప్రభుత్వం తాళంచెవి పోయిందని, డూప్లికేటు దొరికిందని చెప్పుకోవడం విడ్డూరమని, ఈ డూప్లికేటు ప్రభుత్వాన్ని గద్దె దించాలని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు...

Published : 30 Sep 2022 03:48 IST

బిజద ప్రభుత్వంపై జె.పి.నడ్డా ఆరోపణలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర, ఇతర అగ్రనేతలతో పార్టీ కార్యాలయం వద్ద నడ్డా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరిపించలేకపోయిన ఒడిశా ప్రభుత్వం తాళంచెవి పోయిందని, డూప్లికేటు దొరికిందని చెప్పుకోవడం విడ్డూరమని, ఈ డూప్లికేటు ప్రభుత్వాన్ని గద్దె దించాలని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఏర్పాటైన భాజపా శక్తి కేంద్రాల త్రిదేవ్‌ సమావేశంలో పాల్గొన్న నడ్డా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేరు ప్రస్తావించకుండా ఆయన పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు.

ఇది భక్షకుల పాలన
ఒడిశా మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులకు హత్యలతో సంబంధం ఉందని, భక్షకుల పాలనలో ప్రజలకు రక్షణ ఎలా సాధ్యమని నడ్డా ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. ప్రతి పథకంలో నిధులు గోల్‌మాల్‌ అవుతున్నాయని, కేంద్రం కేటాయించిన నరేగా, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛభారత్‌, పీఎంజీఎస్‌వై తదితర కార్యక్రమాల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయన్నారు. పీఎంఏవై గృహాలు అధికార పార్టీ కార్యకర్తల సొంతం కాగా, ఇళ్లపై బిజు పక్కాఘర్‌ ముద్రలు వేయించారన్నారు.

కార్యకర్తలు ఉద్యమించండి
ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి పెద్ద మొత్తాలు కేటాయించారని, ఉన్నత విద్య, వైద్య సంస్థలు ఏర్పాటు చేశారన్న నడ్డా ప్రకృతి ప్రసాదించిన సంపదలకు నిలయమైన ఒడిశాలో పేదరికం తాండవిస్తోందని, వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భాజపా కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి డబుల్‌ ఇంజిన్‌ పాలనకు ఉద్యమించాలన్నారు. బూత్‌ స్థాయిల్లో భాజపాను బలోపేతం చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. పంచాయతీ స్థాయిల్లో ఏర్పాటైన భాజపా శక్తి కేంద్రాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కూడిన త్రిదేవులు రాష్ట్రంలో కమలం వికాసానికి చిత్తశుద్ధిగా శ్రమించాలని నడ్డా పిలుపిచ్చారు.

భాజపా శ్రేణుల్లో ఉత్సాహం
కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు సమీర్‌ మహంతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. 12 గంటలకు భువనేశ్వర్‌ చేరుకున్న నడ్డాను విమానాశ్రయంలో నేతలు గజమాలతో స్వాగతించారు. ఎయిర్‌ పోర్టు వెలుపల సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు హోరెత్తాయి. తర్వాత పార్టీ అధ్యక్షునికి యువమోర్చా నేతలు బైకు ర్యాలీతో కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాటైన ఫోటో ప్రదర్శన తిలకించిన నడ్డా తర్వాత జనతా మైదానికి చేరుకున్నారు.

నేడు జగన్నాథ దర్శనం
శుక్రవారం ఉదయం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ దర్శనం చేసుకోనున్న నడ్డా ఆ తర్వాత భాజపా సీనియర్‌ నేతలతో చర్చిస్తారు. అనంతరం జనతా మైదానంలో మరోసారి అందర్నీ కలుసుకుంటారని భాజపా వర్గాలు తెలిపాయి.

సభలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు

నడిరోడ్లపై ప్రసవాలు
రాష్ట్రంలో ప్రసూతి సేవలు అధ్వానంగా ఉన్నాయనడానికి ప్రత్యక్ష రుజువులు నడిరోడ్లపై జరుగుతున్న ప్రసవాలేనని నడ్డా అన్నారు. ప్రసవ వేదన పడుతున్నవారికి ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్సులు లేని దుస్థితి ఇంకెక్కడా లేదన్నారు. చివరికి డోలీలు, సైకిళ్లపై గర్భిణులను తరలిస్తున్న దృశ్యాలు ఈ రాష్ట్రానికే పరిమితమన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం కింద 50 కోట్ల కుటుంబాలు వైద్య సేవలందుకుంటున్నాయని, దీనికి మోకాలడ్డిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు.

కలుషిత నీరే గతి
కేంద్రం రాష్ట్రానికి జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.4,966 కోట్లు కేటాయించిందని, ఈ నిధులు సద్వినియోగం కాలేదని నడ్డా ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలు కొండ కోనల్లో ఊట నీరు, చెరువుల్లోని కలుషిత జలాలు తాగి అనారోగ్యం బారిన పడుతుండడమే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు