logo

జనంతో మమేకం.. అదే పార్టీ నినాదం

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన బిజద పార్టీ ఉత్తమ పాలన, మహాత్ముడి ఆదర్శాలకు ప్రతీకగా నిలుస్తోందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. గాంధీ జయంతి (అక్టోబరు2) నుంచి నవంబరు 2 వరకు (నెల రోజులు) రాష్ట్రంలోని 114 పట్టణాలు, 314 సమితుల్లో బిజద జనసంపర్క యాత్రలకు శ్రీకారం చుట్టింది.

Published : 03 Oct 2022 03:12 IST

బిజద జనసంపర్క యాత్ర ప్రారంభోత్సవంలో సీఎం నవీన్‌

భువనేశ్వర్‌లో ప్రారంభమైన యాత్రలో నేతలతో కలిసి నడుస్తున్న నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే:  రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన బిజద పార్టీ ఉత్తమ పాలన, మహాత్ముడి ఆదర్శాలకు ప్రతీకగా నిలుస్తోందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. గాంధీ జయంతి (అక్టోబరు2) నుంచి నవంబరు 2 వరకు (నెల రోజులు) రాష్ట్రంలోని 114 పట్టణాలు, 314 సమితుల్లో బిజద జనసంపర్క యాత్రలకు శ్రీకారం చుట్టింది. భువనేశ్వర్‌ లింగరాజ్‌ కూడలి వేదికగా ఆదివారం ఏర్పాటైన కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల రోజుల యాత్రలో నేతలు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో గడప గడపకు వెళ్లి ప్రజల ఇబ్బందులు పరిశీలించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించి, జనంతో పార్టీ మమేకమై ఉందని తెలియజేయాలన్నారు. ‘జీవనబింధు’(రక్తదాన శిబిరాలు) కార్యక్రమాలు చేపట్టి రక్త నిల్వలు పెంచాలని, మో పరివార్‌ సేవలు విస్తృతం చేయాలని సూచించారు.

శ్రేణుల్లో ఉత్సాహం
కొవిడ్‌ మూలంగా కొన్నాళ్లుగా వీడియో కాన్ఫ్‌రెన్స్‌లకు పరిమితమైన సీఎం.. గత నెల 29, 30 తేదీల్లో భువనేశ్వర్‌లో నిర్వహించిన బిజద నేతల శిక్షణ శిబిరంలోనూ వీసీలోనే పాల్గొన్నారు. యాత్ర ప్రారంభం సందర్భంగా ఆదివారం ప్రత్యక్షంగా జనాల మధ్యకు వచ్చి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ప్రారంభ కార్యక్రమంలో నేతలు, ప్రజలకు అభివాదం తెలుపుతున్న ముఖ్యమంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా సందడి
సీఎం పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బిజద నేతలు, కార్యకర్తల పాదయాత్రలు ప్రారంభించారు. బిజద ప్రతి సంవత్సరం అక్టోబరు 2 నుంచి జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి (అక్టోబరు 11) వరకు జన సంపర్క యాత్ర చేపట్టడం ఆనవాయితీ, కొవిడ్‌ మూలంగా గడిచిన రెండేళ్లు ఈ కార్యక్రమాలు జరగలేదు. ఈసారి అనుకూలంగా ఉండడంతో నెల రోజులు ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతోపాటు బిజద ఏర్పాటై 25 వసంతాలు నిండడం కలిసొచ్చే అంశం. జనాదరణలో మొదటి మెట్టుపై ఉన్న పార్టీని మరింత బలోపేతం చేసి 2024 ఎన్నికలకు సిద్ధం కావడానికే ఈ యాత్ర అని పరిశీలకు అభిప్రాయ పడుతున్నారు.


విజయాలను ప్రజల్లోకి తీసుకెళతాం

పాదయాత్రలో దేవి ప్రసాద్‌ మిశ్ర, ఎమ్మెల్యే దేవి రంజన్‌ తదితరులు

కటక్‌, న్యూస్‌టుడే: సీఎం నవీన్‌ సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని, కేంద్రం చూపిస్తున్న వివక్ష వివరిస్తామని మాజీ మంత్రి దేవి ప్రసాద్‌ మిశ్ర అన్నారు. ఆదివారం కటక్‌ ప్రారంభించి పాదయాత్రలో మాట్లాడారు. గాంధీ జయంతి నుంచి ప్రజా నాయకుడు జై ప్రకాష్‌ నారాయణ జయంతి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గౌరీ శంకర్‌ పార్క్‌ వద్ద మొదలైన యాత్ర షహీద్‌ భవన్‌ వద్ద ముగిసింది. కటక్‌ మేయర్‌ సుభాష్‌ సింగ్‌, బిజద జిల్లా అధ్యక్షుడు దేబాసిస్‌ సామంతరాయ్‌, బంకి శాసనసభ్యులు దేవి రంజన్‌ మిశ్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని