logo

ఏకామ్ర క్షేత్రానికి కొత్త సొబగులు

భువనేశ్వర్‌లోని సుప్రసిద్ధ ఏకామ్ర (లింగరాజ్‌) శైవ క్షేత్రానికి నూతన సొబగులు, సౌకర్యాలు సమకూరనున్నాయి. కేంద్ర ప్రాచీన స్మారక కట్టడాల సంస్థ (ఎన్‌ఎంఏ) ఈ పనులకు అనుమతులిచ్చింది.

Updated : 04 Oct 2022 05:24 IST

నూతన నిర్మాణాలు, సౌకర్యాలకు ఎన్‌ఎంఏ ఆమోదం

త్వరలో పనులు ప్రారంభమన్న మంత్రి పండా

అభివృద్ధి పనుల మాస్టర్‌ ప్లాన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని సుప్రసిద్ధ ఏకామ్ర (లింగరాజ్‌) శైవ క్షేత్రానికి నూతన సొబగులు, సౌకర్యాలు సమకూరనున్నాయి. కేంద్ర ప్రాచీన స్మారక కట్టడాల సంస్థ (ఎన్‌ఎంఏ) ఈ పనులకు అనుమతులిచ్చింది.

అలనాటి రాజుల వైభవం

రాష్ట్రంలో శైవ పీఠాల్లోకెల్లా ముఖ్యమైనది లింగరాజ్‌. 10వ శతాబ్దంలో నాటి కళింగ పాలకుడు బజాతి కేసరిదేవ్‌ ఈ ముక్కంటి క్షేత్ర నిర్మాణం చేయించారు. ఆయన తర్వాత పాలించిన లలాటేందు కేసరిదేవ్‌ హయాంలో పనులు పూర్తయ్యాయి. 55 మీటర్ల ఎత్తులో నిర్మాణమైన ఈ ఆలయం కళింగ శిల్పకళావైభానికి ప్రతీకకగా నిలుస్తోంది. దీనికి చేరువలో రాజారాణి, ముక్తేశ్వర, బిందు సాగరం (పుష్కరిణి) అనంత వాసుదేవ, ఇతర సాంస్కృతిక పీఠాలు అప్పట్లో ఏర్పాటయ్యాయి.

కాలప్రవాహంలో  ఇరుకుగా

కాలక్రమంలో భువనేశ్వర్‌ రాష్ట్ర రాజధానిగా ఏర్పాటైన తర్వాత అనేక నిర్మాణాలు జరిగాయి. జన సంఖ్య, స్థలాల ఆక్రమణలూ పెరిగాయి. లింగరాజ్‌ ఆలయ స్థలాల్లోనూ అడ్డదిడ్డంగా కట్టడాలు వెలిశాయి. దీంతో రోడ్లు ఇరుకుగా మారాయి. అసంఖ్యాక భక్తులు ముక్కంటి దర్శనానికి వస్తున్నారు. వారికి సరైన సౌకర్యాలు లేవు. పవిత్రమైన బిందుసాగరం కలుషితమైంది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం పూరీ శ్రీక్షేత్ర కారిడార్‌ తరహాలో విస్తరణ, రహదారుల వెడల్పు, భక్తుల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

పాండ్యన్‌ సందర్శన తర్వాత

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాల మేరకు 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ ఇటీవల ఏక్రామ క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించిన తర్వాత ఆధునికీకరణ పనుల మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైంది. ఆక్రమణలు తొలగించారు. కొత్త నిర్మాణాలకు అనుమతించాలని ప్రభుత్వం ఎన్‌ఎంఏకు లేఖ రాసింది. ముక్కంటి ఆలయ సంరక్షణ బాధ్యత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాచీన కట్టడం జోలికి వెళ్లకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎన్‌ఏంఏ ప్రభుత్వానికి తెలియజేసింది.

బిందు సాగరం

ఈ.వెయ్యికోట్ల వ్యయం

ఏకామ్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అశోక్‌చంద్ర పండా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలు, ప్రాచీన సందర్శనీయ స్థలాల ఆధునికీకరణ పనులకు ప్రాధాన్యమిచ్చిన సీఎం లింగరాజ్‌ ఆలయ ఆధునికీకరణ నిర్మాణాలకు రూ.వెయ్యికోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.    

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts