logo

17న హైదరాబాదులో సదస్సు

ఈ నెల 17న హైదరాబాదు (తెలంగాణ)లో ఒడిశా ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పాల్గొని పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చిస్తారు.

Published : 05 Oct 2022 02:29 IST

పెట్టుబడిదారులతో నవీన్‌ భేటీ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఈ నెల 17న హైదరాబాదు (తెలంగాణ)లో ఒడిశా ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పాల్గొని పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చిస్తారు. కార్యక్రమంలో పరిశ్రమలు, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్‌ దేవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దసరా సెలవుల తర్వాత పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి హేమంత శర్మ హైదరాబాదు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. గతంలో దుబాయ్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరులలో ఏర్పాటైన కార్యక్రమాల్లో సీఎం పెట్టుబడిదారులతో చర్చించారు. మంచి ఫలితాలొచ్చాయని మంత్రి దేవ్‌ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. హైదరాబాదులో ఐటీ, ఉక్కు, అల్యూమినియం, విద్యుత్తు, చేనేత, జౌళి, పర్యటక రంగాల్లో పెట్టుబడులపై సీఎం పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు (5 రోజులు) భువనేశ్వర్‌ ప్రదర్శనా మైదానంలో మేకిన్‌ ఒడిశా సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికిది అద్దం పడుతుందన్న ఆశాభావం ఉందని మంత్రి తెలిపారు. ఈ సదస్సులో దేశ విదేశాల కంపెనీల యాజమాన్యాలు, సీఈవోలు పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి ఇంతవరకు రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, కొన్ని సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఆసక్తి లేని విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, వాటిని పట్టించుకోబోమన్నారు. హైదరాబాదు సదస్సులో ప్రముఖ కంపెనీల యజమానులు పాల్గొంటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని