logo

భాజపా ధాంనగర్‌ అభ్యర్థి సూరజ్‌?

ధాంనగర్‌ (భద్రక్‌ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధాంనగర్‌ దివంగత ఎమ్మెల్యే బిష్ణుశెఠి కుమారుడు సూరజ్‌ సూర్యవంశీ భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ పార్టీ నాయకత్వం ఈమేరకు అధికారికంగా ప్రకటించనుంది.

Published : 07 Oct 2022 04:32 IST

బిజద కోసం పేర్లు పరిశీలిస్తున్న నవీన్‌

రెండ్రోజుల్లో ఖాయం చేస్తామన్న కాంగ్రెస్‌

బిష్ణుశెఠి భార్య, కుమార్తెతో మాట్లాడుతున్న నడ్డా, ధర్మేంద్ర (పాత చిత్రం)

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ధాంనగర్‌ (భద్రక్‌ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధాంనగర్‌ దివంగత ఎమ్మెల్యే బిష్ణుశెఠి కుమారుడు సూరజ్‌ సూర్యవంశీ భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ పార్టీ నాయకత్వం ఈమేరకు అధికారికంగా ప్రకటించనుంది.

సానుభూతిపై నమ్మకం

బిష్ణుశెఠి మృతి పట్ల ధానంనగర్‌వాసుల్లో సానుభూతి ఉందన్న ఉద్దేశంతో భాజపా ఆయన తనయునికి టిక్కెట్టు కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సూరజ్‌ సూర్యవంశీ భద్రక్‌ జిల్లా యువమోర్చా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గత నెల 30న బిష్ణుశెఠి శ్రాద్ధకర్మల్లో పాల్గొనేందుకు భాజపా కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ధాంనగర్‌ వచ్చారు. శెఠి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత సూరజ్‌ అభ్యర్థిత్వం ఖరారు చేశారని తెలిసింది.

బుధిరాంకు అవకాశం?

వరుస పరాజయాలతో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌ ధాంనగర్‌లో విజయం సాధించాలన్న ధ్యేయంతో ఉంది. 2019లో ఈ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బుధిరాం సమాల్‌ ధరావతు కోల్పోయారు. ఈసారి మళ్లీ బుధిరాం టిక్కెట్టు ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ అభ్యర్థి ఖరారు కోసం కమిటీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. పీసీసీ మాజీ అధ్యక్షుడు జయదేవ్‌ జెనా గురువారం ధానంనగర్‌ చేరుకుని కార్యకర్తలతో మంతనాలు జరిపారు.

కచ్చితంగా గెలుస్తాం

భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సమీర్‌ మహంతి గురువారం భువనేశ్వర్‌ విలేకరులతో మాట్లాడుతూ... ధాంనగర్‌లో భాజపా విజయం తథ్యమన్నారు. కేంద్ర నాయకత్వం సూరజ్‌ సూర్యవంశీ పేరు అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. 2024 సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక భాజపాకు ప్రతిష్టాత్మకమని తెలిపారు.

గురి తప్పదు

బిజద అధికార ప్రతినిధి లెనిన్‌ మహంతి గురువారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.... ఇక్కడ గతసారి పార్టీ అభ్యర్థి స్పల్ప ఓట్ల లేడాతో ఓటమి పాలయ్యారని, ఈసారి గురి తప్పదని పేర్కొన్నారు. అభ్యర్థి ఖరారుకు సంబంధించి సీఎం అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారని, రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

సమష్టిగా ఉద్యమిస్తాం

పీసీసీ మాజీ అధ్యక్షుడు జెనా గురువారం ధాంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.... విజయావకాశాలున్న ఉత్తమ అభ్యర్థిని బరిలోకి దింపి సమష్టిగా ఉద్యమిస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలు చెబుతామని, బిజద, భాజపాలు వేరుకాదని, లోపాయికారీ అవగాహన ఉందని వివరిస్తామన్నారు. పరాజయాల నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్‌ ఈ స్థానం గెలిచి విజయాలకు బాట వేసుకుంటుందన్నారు.

ఇద్దరిలో ఎవరికి?

బిజద అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని భద్రక్‌ జిల్లా నాయకత్వానికి ఆదేశించారు. శుక్రవారం ఆయనకు అర్హుల వివరాలు అందనున్నాయి. 2019 ఎన్నికల్లో బిజద అభ్యర్థిగా పాటీ చేసిన రాజేంద్రదాస్‌ స్వల్ప ఓట్లు (4,625) తేడాతో ఓడిపోయారు. అప్పట్లో బిజద టిక్కెట్టు ఆశించి భంగపడిన ముక్తికాంత మండల్‌ వర్గీయులు రాజేంద్ర ఓటమికి కారణమయ్యారని అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజేంద్ర, ముక్తికాంత నవీన్‌కు దరఖాస్తులు చేశారు. సీఎం వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారా? ఇతరులకు అవకాశం ఇస్తారా? అన్నది త్వరలో స్పష్టం కానుంది.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని