logo

Honey Trap: వగ‘లేడి’ వల.. ప్రముఖులు గిలగిల!

ఆకట్టుకునే అందం ఆమెది. దానినే ఎరగా వాడుకుంది. కవ్వించే కైపుతో సమాజంలో పేరున్న వారిని, ప్రముఖులను, బడాబాబులను కొంగుకు చుట్టుకుంది. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసుకుని దాచిపెట్టుకుంది. ఆపై ఇంకేముంది ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది.

Updated : 10 Oct 2022 07:19 IST

అర్చన వద్ద మంత్రి, పలువురి ఎమ్మెల్యేల నగ్న వీడియోలు
వాటితో రూ. కోట్లు డిమాండ్‌
ఇవ్వకపోతే బయట పెడతానని బెదిరింపులు
భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే

ఆకట్టుకునే అందం ఆమెది. దానినే ఎరగా వాడుకుంది. కవ్వించే కైపుతో సమాజంలో పేరున్న వారిని, ప్రముఖులను, బడాబాబులను కొంగుకు చుట్టుకుంది. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసుకుని దాచిపెట్టుకుంది. ఆపై ఇంకేముంది ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. రూ. కోట్లు గడించింది. పాపం పండడంతో చివరకు పోలీసులకు చిక్కింది. కానీ ఇక్కడే కేసులో అసలు మలుపు తిరిగింది. మాయలేడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌, హార్డ్‌ డిస్కులు, చరవాణులు, పెన్‌ డ్రైవ్‌లు, ఈ మెయిల్స్‌, వీడియోలు పరిశీలించగా పోలీసులు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

కి‘లేడి’ బ్లాక్‌ మెయిలర్‌ అర్చన నాగ్‌ను పోలీసులు విచారిస్తున్న కొద్దీ.. వెలుగు చూస్తున్న వాస్తవాలు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. పోలీసు వర్గాలు అందించిన వివరాల ప్రకారం.. 64 మంది ప్రముఖులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. 2015లో కలహండి జిల్లాలోని కెసింగ అనే ప్రాంతం నుంచి భువనేశ్వర్‌ వచ్చిన అర్చన అనతి కాలంలో రూ. కోట్లకు పడగలెత్తడంపై.. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


భర్త జోగబంద్‌ నాగ్‌తో అర్చన

యువతులతో వ్యభిచారం 

భువనేశ్వర్‌లోని బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్న సమయంలో అర్చన.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీస్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు సంపాదించి, పరిచయాలు పెంచుకుంది. వారితో ఏకాంతంగా గడిపే సమయంలో రహస్య కెమెరాలతో వీడియోలు తీసి వాటితోనే బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగేదని, ఈ విధంగా కోట్ల రూపాయలు వసూలు చేసిందన్న సమాచారం తమ వద్ద ఉందని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యభిచారాన్ని ప్రధాన వ్యాపారంగా చేసుకుందని బెంగాల్‌, ముంబయి నుంచి యువతులను భువనేశ్వర్‌ తీసుకొచ్చేదని వెల్లడించారు.

నేతల్లో వణుకు 

మంత్రి, ఎమ్మెల్యేలు పేర్లు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బిజద, భాజపా, కాంగ్రెస్‌ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఇదే పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో అర్చన వ్యవహారం కాక రేపుతుండడంతో పోలీసు అధికారులు సెలవులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది.


అర్చన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ పాత్ర్‌, ఆమె భర్త జోగబంద్‌ నాగ్‌

మూడు కంపెనీలకు యజమాని... 

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, మగవారి బలహీనతతో అడ్డదారుల్లో సంపాదించిన అర్చనకు పాత కార్ల షోరూం, ఆదిత్య ప్రెస్టీజ్‌ లిమిటెడ్‌తోపాటు మరో కంపెనీ ఉంది. భువనేశ్వర్‌ సత్య విహార్‌ ప్రాంతంలో రూ. కోట్ల విలువ చేసే భవంతిని నిర్మించి, 2021 జనవరి నెలలో ఎమ్మెల్యే సూర్యనారాయణ పాత్ర్‌తో ప్రారంభం చేయించింది.

‘ఆ పేర్లు బయటకు చెప్పండి’ 

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అర్చనకు భవనాలు, ఫార్మ్‌ హౌస్‌, ఖరీదైన గుర్రాలు, విదేశీ జాగిలాలు, అధునాతన కార్లు, ద్విచక్రవాహనాలు ఎలా వచ్చాయో తేల్చాలని, 64 మంది పేర్లు బయటకు వెల్లడించాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శృతి పట్నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదన్నారు. నేతలను, పోలీసు అధికారులను కాపాడాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అర్చన భర్త బిజదలో క్రియాశీలకంగా ఉండేవాడని తెలిపారు.

భర్త సహకారంతోనే ఇదంతా.. 

అర్చనను విచారిస్తున్న పోలీసులు ఆమె చెప్పిన పేర్లు, ఈమెయిల్స్‌, పెన్‌డ్రైవ్‌లలోని సమాచారం చూసి నివ్వెరపోయారు. ఒక మంత్రి, పశ్చిమ ఒడిశాలో గుర్తింపు ఉన్న భాజపా నేత, శాసన సభ్యులు, బిల్డర్లు, సినీ నిర్మాతలు, పోలీస్‌ అధికారులు, వారికి సంబంధించిన నగ్న చిత్రాలు చూసి ఖిన్నులయ్యారు. మంత్రి, అర్చన కలిసి నగ్నంగా ఉన్న చిత్రాలను గుర్తించిన పోలీసులు వాటితో ఆయనకు రూ.ఐదు కోట్లు, ఎమ్మెల్యేల నుంచి రూ. కోటి డిమాండ్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతా ఆమె భర్త జోగ బందు నాగ్‌ సహకారంతో నడిపించిందని, రహస్య కెమెరాలు పెట్టడం, చిత్రీకరించడం అతడే చేసినట్లు తెలిపిన పోలీసులు పరారీలో ఉన్న జోగ బంద్‌ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని