logo

Cyclone: తుపాను తీరం దాటేదెక్కడ?

అండమాన్‌ వద్ద సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉందని, గురువారం ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Updated : 20 Oct 2022 07:31 IST

ఇంకా స్పష్టత లేదన్న ఐఎండీ


అండమాన్‌లో ప్రస్తుత పరిస్థితి (బుధవారం ఐఎండీ విడుదల చేసిన మ్యాప్‌)

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: అండమాన్‌ వద్ద సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉందని, గురువారం ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. 22 ఉదయంలోగా వాయుగుండంగా మారనున్న పీడనం మరింత బలం పుంజుకొని 23న తుపానుగా మారుతుందన్నారు. తూర్పు కేంద్ర బంగాళాఖాతం నుంచి ఈ విపత్తు పశ్చిమ కేంద్ర బంగాళాఖాతానికి చేరువవుతుందని, ఆ తర్వాత మళ్లీ దిశ మార్చుకుని తీరంవైపు వస్తుందని చెప్పారు. తుపాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, 22న పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉపరితలంలో 22వ తేదీ నుంచి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు.  చేపల వేట నిషేధించినట్లు చెప్పారు.


తీవ్రత ఎక్కువగానే ఉండొచ్చు
అమావాస్యతో రాకాసి అలల ముప్పు
ఈ ఏడాది దీపావళి వేడుకలు సాధ్యమేనా?

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: అండమాన్‌లో ఏర్పడిన ఆవర్తనం తుపాను కానుందని స్పష్టమైంది. అమావాస్య సమయంలో ఈ విపత్తు తీరానికి చేరువవుతోంది. దీంతో రాకాసి అలలు విరుచుకు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ అధ్యయన నిపుణులంటున్నారు.

బలం పుంజుకునే అవకాశం

తుపాను బలం పుంజుకోవడానికి సముద్రం, వాయుమండలంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ అధ్యయన నిపుణుడు డాక్టర్‌ సందీప్‌ పట్నాయక్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. గాలి తీవ్రత, వర్షపాతం ఎలా ఉంటుందనేది 22న స్పష్టమవుతుందన్నారు. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు తీవ్రంగా ఉంటాయని, ఈ స్థితిలో నెలకొన్న విపత్తు వల్ల తీరంవైపు రాకాసి అలలు విరుచుకుపడతాయని చెప్పారు.

ప్రయాణ దిశ 22న తెలుస్తుంది

ఐఎండీ మాజీ ఉన్నతాధికారి డాక్టర్‌ శరత్‌ చంద్ర సాహు బుధవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... ప్రస్తుత ఆవర్తనం తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు.  ఈ విపత్తు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా లేదా ఉత్తర ఒడిశా పశ్చిమ్‌బంగల తీరాలకు చేరువయ్యే సూచనలున్నాయన్నారు. తుపాను ఏ దిశగా ప్రయాణిస్తుందో 22న తెలుస్తుందన్నారు.


26 వరకు ప్రభావం

తుపాను ప్రభావంతో 23 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, 24, 25 తేదీల్లో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపత్తు 26 వరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.


ఎల్లెడలా నిరుత్సాహం

ఈ ఏడాది దీపావళి వేడుకలు వర్షాల వల్ల సజావుగా సాగవని భావిస్తుండడంతో అందరూ నిరుత్సాహానికి గురవుతున్నారు. బాణసంచా వ్యాపారులు నష్టాలు తప్పవని ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటామని ఆశలు పెంచుకున్న కుమ్మరులు ఉసూరుమంటున్నారు.  మిఠాయి వ్యాపారుల్లోనూ ఆవేదన కనిపిస్తోంది. తుపాను సమాచారంతో ప్రజలు మార్కెట్లకు రావడం లేదని, విక్రయాలు పూర్తిగా పడిపోయాయని వాపోతున్నారు. మరోవైపు విపత్తుల నివారణ శాఖ ఆదేశాల మేరకు గంజాం, పూరీ, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, ఖుర్దా, భద్రక్‌, బాలేశ్వర్‌ జిల్లాల కలెక్టర్లు, అత్యవసర శాఖల అధికారులు 24 గంటలు విధులు నిర్వహించే కంట్రోల్‌ గదులు ప్రారంభించి పరిస్థితిపై నిఘా ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని