logo

తుపాను ముప్పు లేనట్లే

ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో గురువారం అల్పపీడం ఏర్పడినట్లు గోపాలపూర్‌ డాప్లార్‌ రాడార్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. పీడనం ఉత్తర, పశ్చిమ దిశగా కదిలి 22న వాయుగుండంగా మారుతుందని, 23న మరింత తీవ్రరూపం దాల్చి 24న తుపానుగా బలం పుంజుకుంటుందని తెలిపారు.

Updated : 21 Oct 2022 07:30 IST

22న వాయుగుండం.. 24న తుపాను

25న బెంగాల్‌, బంగ్లాల మధ్య తీరం దాటే అవకాశం

 రెండు రోజులు తీర జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు

అండమాన్‌లో అల్పపీడనం

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో గురువారం అల్పపీడం ఏర్పడినట్లు గోపాలపూర్‌ డాప్లార్‌ రాడార్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. పీడనం ఉత్తర, పశ్చిమ దిశగా కదిలి 22న వాయుగుండంగా మారుతుందని, 23న మరింత తీవ్రరూపం దాల్చి 24న తుపానుగా బలం పుంజుకుంటుందని తెలిపారు. తరువాత ఇది ఉత్తర, తూర్పు దిశలో ప్రయాణిస్తుందన్నారు. ఒడిశా తీరం మీదుగా ఈ విపత్తు 24 రాత్రి లేదా 25 ఉదయానికి పశ్చిమ్‌బంగ, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటుతుందని చెప్పారు. దీని ప్రభావం రాష్ట్రంపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు.

ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో తీర జిల్లాల్లో 24, 25 తేదీల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, భద్రక్‌, బాలేశ్వర్‌, పూరీ, ఖుర్దా జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, కటక్‌, జాజ్‌పూర్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. 22 నుంచి 25 వరకు చేపలవేట నిషేధించినట్లు ఉమాశంకర్‌ దాస్‌ వివరించారు.

గాలి తీవ్రత 22న స్పష్టమవుతుంది

ఈ తుపాను సమయంలో గాలి తీవ్రత ఎంతన్నది 22వ తేదీన స్పష్టం చేస్తామని దాస్‌ చెప్పారు. రాష్ట్రానికి తుపాను ముప్పు లేదని ఐఎండీ స్పష్టం చేయడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు విపత్తు నివారణశాఖ ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటోంది.

కలెక్టర్లను అప్రమత్తం చేశాం: మంత్రి ప్రమీలా మల్లిక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: వాతావరణ అధ్యయన శాఖ సూచనల మేరకు గంజాం, ఖుర్దా, పూరీ, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, భద్రక్‌, బాలేశ్వర్‌ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖల మంత్రి ప్రమీలా మల్లిక్‌ చెప్పారు. గురువారం భువనేశ్వర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, ఓడ్రాఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయని వివరించారు. 7 తీర జిల్లాలపై గట్టి నిఘా ఉంచామని, అవసరమైతే వెంటనే తీర ప్రాంత ప్రజల్ని తుపాను రక్షిత కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: మేయర్‌ సుభాష్‌ సింగ్‌

కటక్‌, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరికల నేపథ్యంలో కటక్‌ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎంసీ మేయర్‌ సుభాష్‌ సింగ్‌ అన్నారు. గురువారం ఆయన తన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిస్తే నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశాలు ఉన్నాయని, అవసరమైతే ఈ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా తక్షణం బయటకు పంపేందుకు 200లకుపైగా మోటార్లు సిద్ధం చేశామన్నారు. సీఎంసీ సిబ్బంది, అధికారుల సెలవులు రద్దు చేశామని, నగరంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా తక్షణం తెలియజేసేందుకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటారన్నారు. ఆహార సామగ్రి, ఔషధాలు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని