logo

Chandra grahan 2022: ఉద్రిక్తతలకు దారి తీసిన ‘గ్రహణ భోజనం’

చంద్ర గ్రహణంపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాల్ని తొలగించే పేరుతో ‘మానవతావాది హేతువాది సంస్థ’ (హెచ్‌ఆర్‌ఓ) గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రహణ సమయంలో భోజనం చేసే ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Updated : 09 Nov 2022 09:43 IST

బ్రహ్మపురలో పేడతో దాడి.. లాఠీలు ఝుళిపించిన పోలీసులు


రామలింగం ట్యాంకు రోడ్డులో ప్రదర్శన జరుపుతున్న బ్రాహ్మణ పురోహిత సమితి ప్రతినిధులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: చంద్ర గ్రహణంపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాల్ని తొలగించే పేరుతో ‘మానవతావాది హేతువాది సంస్థ’ (హెచ్‌ఆర్‌ఓ) ఒడిశాలోని గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రహణ సమయంలో భోజనం చేసే ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు ఆందోళనకు దిగడంతోపాటు హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. మధ్యాహ్నం స్థానిక సిటీ హైస్కూలు రోడ్డులో రెండు గంటలకుపైగా అశాంతి వాతావరణం నెలకొంది.

ఇవీ వివరాలు.. చంద్ర గ్రహణం నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఓ గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సిటీ హైస్కూలు రోడ్డులోని చారవాక్‌ భవన్‌ వద్ద ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలతో సామూహిక భోజనాలకు ఏర్పాట్లు చేసింది. ప్రఫుల్ల సామంత్రాయ్‌, ఈ.టి.రావు. కె.నందేశు సేనాపతి, బాలచంద్ర షడంగి, జమ్ముల సురేష్‌, అబనీ గయా, కిశోర్‌ మిశ్ర, మధుసూదన్‌ సెఠి, బృందావన ఖొటెయి, శంకర సాహు, ప్రతాప్‌ ప్రధాన్‌, పార్వతి తదితరులు పాల్గొన్నారు.


హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులపై దూసుకు వస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు

రెండువైపులా దూసుకువచ్చి..

హెచ్‌ఆర్‌ఓ చేపట్టిన కార్యక్రమాన్ని గంజాం జిల్లా బ్రాహ్మణ పురోహిత సమితి, భజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంస్థలు వ్యతిరేకించాయి. ఒక సంస్థ ఆధ్వర్యంలో రామలింగం ట్యాంకు రోడ్డులోని ఎత్తయిన హనుమాన్‌ విగ్రహం వద్ద ప్రదర్శన జరపగా, మరికొందరు చారవాక్‌ భవన్‌ సమీపాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు రెండువైపుల నుంచి చారవాక్‌ భవన్‌ వద్దకు ఒక్కసారిగా కర్రలతో చేరుకుని వాగ్వాదానికి దిగారు. భవన్‌ ముందు వెదురుతో వేసిన గుడ్డ పెండాల్‌ను తొలగించి తోపులాటకు దిగారు. కొందరు హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులపై పేడతో దాడి చేశారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించి వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ మళ్లీ ఆయా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చారవాక్‌ భవన్‌ వద్దకు చేరుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. చివరకు పోలీసులు హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులకు నచ్చజెప్పి, వారిని భద్రత మధ్య అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. గ్రహణ భోజనాన్ని బలవంతంగా అడ్డుకోవడం, దాడి దారుణమని హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులు విలేకరుల వద్ద పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా చారవాక్‌ భవన్‌ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ అసీమ్‌ పండా, బ్రహ్మపుర ఎస్డీపీఓ రాజీవ్‌ లోచన్‌ పండా, పెద్దబజారు, టౌన్‌ ఠాణాల ఐఐసీలు ప్రశాంత భూపతి, సురేష్‌ త్రిపాఠి ఇతర అధికారులు శాంతిభద్రతల్ని పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు