logo

Droupadi Murmu: అప్పట్లో ఆవుపేడతో పాఠశాల అలికాను: రాష్ట్రపతి ద్రౌపది

బాల్యంలో తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన మయూర్‌భంజ్‌ జిల్లా ఉపరబెడ గ్రామ పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని, పెచ్చులూడిన నేలపై తాను ఆవుపేడతో అలికి కూర్చొని చదువుకున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.

Updated : 12 Nov 2022 11:23 IST

నాడు విద్యాలయాలకు సౌకర్యాలు ఉండేవి కావు

ఇప్పుడు అవకాశాలు పుష్కలం.. మీరంతా రాణించాలి

పాఠశాల విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది

తాను చదివిన ఖండగిరి పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీరు పోస్తున్న ద్రౌపది

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బాల్యంలో తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన మయూర్‌భంజ్‌ జిల్లా ఉపరబెడ గ్రామ పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని, పెచ్చులూడిన నేలపై తాను ఆవుపేడతో అలికి కూర్చొని చదువుకున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకొచ్చిన ఆమె శుక్రవారం భువనేశ్వర్‌లో తాను చదువుకున్న ఖండగిరి (భువనేశ్వర్‌) పరిధిలోని బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. ఇక్కడ తాను 1970 నుంచి 1974 వరకు 8వ తరగతి నుంచి 11 వరకు చదువుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న తపోబన్‌, కుంతలకుమారీ ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలను ఆమె సందర్శించారు. బాలబాలికలతో ముచ్చటించారు. తనతో కలిసి చదువుకున్న 13 మంది స్నేహితురాళ్లను కలుసుకొని అలనాటి స్మృతులు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పిల్లలతో మాట్లాడుతూ... గిరిజన కుటుంబంలో జన్మించిన తనను చదివించడానికి నాన్నమ్మ అన్నివిధాలా ప్రోత్సహించారన్నారు. అప్పట్లో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, బాలబాలికలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వీయ ప్రయోజనాలకు విద్య పరిమితం కారాదని, దేశం గర్వించే స్థాయికి చేరుకుని సేవలు అందించాలని ఉద్బోధించారు. ఉదయం 9 గంటల నుంచి 11.15 గంటల వరకు పాఠశాలలు, వసతి గృహాల్లో పిల్లలు, ఉపాధ్యాయులు, స్నేహితురాళ్లతో గడిపిన ఆమె ఆయాచోట్ల గ్రూపు ఫోటోలు తీయించుకుని విజిటర్స్‌ పుస్తకంలో అనుభవాలు రాశారు. తర్వాత జయదేవ్‌ భవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో నూతన విద్యావిధానంలో భాగంగా ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి) 12 ప్రాంతీయ భాషల్లో అనువదించిన ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ-కుంభ్‌ ఇంజినీరింగ్‌ (శబ్దకోశం) పోర్టల్‌ ప్రారంభించారు. మాతృభాష మరవరాదని, అమ్మభాషకు ప్రాధాన్యమివ్వడానికి ’నూతన విద్యావిధానం-2020’ అమలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో గవర్నరు ఆచార్య గణేశీలాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఏఐసీటీఈ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌, రాష్ట్ర మంత్రులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి దిల్లీ ప్రయాణమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని