logo

ప్రజారోగ్యం, విద్య, తాగునీటికి ప్రాధాన్యం

శాసనసభలో గురువారం రాత్రి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ప్రదీప్‌ అమత్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16,800 కోట్ల వ్యయంతో కూడిన అదనపు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Published : 25 Nov 2022 05:05 IST

శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌

సభలో బడ్జెట్‌ పద్దులు వివరిస్తున్న మంత్రి అమత్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: శాసనసభలో గురువారం రాత్రి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ప్రదీప్‌ అమత్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16,800 కోట్ల వ్యయంతో కూడిన అదనపు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ప్రణాళికకు రూ.9,200 కోట్లు, యంత్రాంగం వ్యయం కింద రూ.4,934 కోట్లు, విపత్తుల నివారణకు రూ.2,610.46 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇతర నిధుల వ్యయంపై వివరాలు వెల్లడించలేదు. అదనపు బడ్జెట్‌లో ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, క్రీడలు, మిషన్‌ శక్తి, పరిశ్రమలు, విద్య, గ్రామీణ రహదారులు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం అదనపు బడ్జెట్‌ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం బాగుందన్న మంత్రి వివరాలు వెల్లడించలేదు.

అసెంబ్లీ వెలుపల డీజీపీ సునీల్‌ బన్సల్‌, జంట నగరాల కమిషనర్‌

సౌమ్యేంద్ర ప్రియదర్శి, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ


విపక్షాల ఆగ్రహం

ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి నిరంజన్‌ పూజారి సభకు రాకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పద్మపూర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పలువురు మంత్రులు, 50 శాతం ఎమ్మెల్యేలను తరలించడం భావ్యమేనా? అని కాంగ్రెస్‌ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర, భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝిలు నిలదీశారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న సభా కార్యక్రమాల్లో మంత్రులు, సభ్యుల గైర్హాజరుపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. అనారోగ్యం సాకుతో మరికొందరు బిజద మంత్రులు, సభ్యులు ముఖాలు చాటేశారని దుయ్యబట్టారు. గణతంత్రాన్ని అధికారపక్షం నేతలు ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు.


సీఎం ఆదేశించారు

బిజద అధికార ప్రతినిధి రాజకిశోర్‌దాస్‌ సమాధానమిస్తూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పద్మపూర్‌ ప్రచారంలో ఉన్నది వాస్తవమేనన్నారు. వారంతా సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం నవీన్‌ గురువారం సాయంత్రం ఆదేశించినట్లు చెప్పారు.


నవీన్‌ రావాలి

సభ వెలుపల విపక్ష నేతలు విలేకరులతో మాట్లాడుతూ ఉదయం మొక్కుబడిగా సభకు వచ్చిన సీఎం నవీన్‌ సాయంత్రం ముఖం చాటేశారని, ఇది సబబు కాదని, సభా కార్యక్రమాలు ముగిసే వరకూ ఆయన సభకు హాజరవ్వాలని కోరుతున్నామన్నారు.


బ్లాక్‌మెయిలర్‌ వలలో పాలకపక్షం పెద్దలు

నర్సింగ మిశ్ర, మోహన్‌ మాఝిలు బ్లాక్‌మెయిలర్‌ అర్చన నాగ్‌ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఎంతోమంది అధికార పెద్దలు ఈ యువతి ఉచ్చులో పడ్డారని, ఈడీ దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో హోం శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నవీన్‌ రాజీనామా చేయాలని డిమాండు చేశారు. పోడియం వద్ద భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌ రూలింగ్‌ ఇవ్వాలని డిమాండు చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కార్యక్రమాలను శుక్రవారం ఉదయం వరకూ వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.


బందోబస్తు

శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభ వెలుపల, లోపల పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. డీజీపీ సునీల్‌ బన్సల్‌, భువనేశ్వర్‌-కటక్‌ జంట నగరాల కమిషనర్‌ సౌమ్యేంద్ర ప్రియదర్శి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సభ వెలుపల పరిస్థితిని సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని