logo

ఉత్కళ రాష్ట్రంలో ‘స్పందన’ వైభవం

సాహితీ, సాంస్కృతిక రంగాలకు అండగా నిలవాలని, కవులు, కళాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ‘స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ’ ఆదివారం 27వ వార్షికోత్సవం జరుపుకోనుంది.

Updated : 27 Nov 2022 06:06 IST

నేడు 27వ వార్షికోత్సవం

‘స్వరమాధురి’ కార్యక్రమం కోసం సాధన చేస్తున్న గాయనీ, గాయకులు

రాయగడ, న్యూస్‌టుడే: సాహితీ, సాంస్కృతిక రంగాలకు అండగా నిలవాలని, కవులు, కళాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ‘స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ’ ఆదివారం 27వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ప్రముఖ కవి, రచయిత, నటుడు, దర్శకుడు, ప్రయోక్త, పత్రికా సంపాదకుడైన దివంగత గరిమెళ్ల రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 1995లో ఈ సంస్థను తెలుగు, ఒడియా ప్రజలతో మమేకమై సుదీర్ఘకాలంగా సేవలందిస్తోంది. తొలినాళ్లలోనే జాతీయస్థాయిలో రచనలు, అంత్యాక్షరి వంటి పోటీలు నిర్వహించి సంస్థ ప్రతినిధులు కీర్తి గడించారు.

ఎందరో మహానుభావులు..

కథలకు చిరునామాగా నిలిచిన శ్రీకాకుళంలోని ‘కథా నిలయం’ వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు, సినీగేయ రచయిత జాలాది, ప్రముఖ రచయితలు చాగంటి తులసి, జగధాత్రి, తుర్లపాటి రాజేశ్వరి, మోనంగి కామేశ్వరి, అవసరాల రామకృష్ణారావు, వంగపండు ప్రసాదరావు, రావూజీ, తలతోట పృథ్వీరాజ్‌, మాధవీ సనారా, గుండాన జోగారావు వంటి ఎందరో మహానుభావులు ‘స్పందన’ కార్యక్రమాలకు అతిథులుగా హాజరై స్పూర్తిదాయకంగా నిలిచారు. తెలుగు సినీనటులు శ్రీకాంత్‌, ఆహుతి ప్రసాద్‌, రాళ్లపల్లి, కొండవలస వంటి నటులు ఇక్కడ సత్కారం పొందారు. ఈ సంస్థలోని కవులు, కళాకారులు మంచి గుర్తింపు సాధించారు. విశాఖపట్నంలోని కళాభారతి, విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో, పార్వతీపురంలోని జట్టు ఆశ్రమం, జేకే పూర్‌, గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ వంటి ప్రాంతాల్లో నాటికలు ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. విజయనగరంలో ప్రదర్శించిన రాష్ట్రస్థాయి నంది నాటక మహోత్సవంలో పాల్గొన్న కళాకారులను నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించడంతోపాటు రూ.10 వేల నగదు పురస్కారం అందజేశారు.

ఏటా నాటికల ప్రదర్శన..

ఏటా స్పందన కళాకారులు నాటికలు ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతున్నారు. సంస్థలోని కవులు రాసిన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నృత్య, సంగీత పాఠశాల, గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక స్వాగత్‌ రోడ్డు రామలింగేశ్వర ఆలయ కల్యాణ మండపంలో జరగనున్న 27వ వార్షికోత్సవ సభకు ముఖ్యఅతిథిగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ పాత్రికేయులు, ప్రముఖ రచయిత, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి మనుమడు జంధ్యాల శరత్‌బాబు హాజరుకానున్నారు. పురాధ్యక్షుడు మహేష్‌ పట్నాయక్‌ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. సభ అనంతరం స్పందన నృత్య పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన, గాయనీ గాయకుల ‘స్వర మాధురి’ సినీ గీతాలాపన కార్యక్రమాలు జరగనున్నాయి. సాహితీ, సాంస్కృతిక అభిమానులు అందరూ హజరుకావాలని సంస్థ అధ్యక్షుడు ఆనందరావు కుమందాన్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని